ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: చంద్రబాబు

28 Mar, 2020 04:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను నియంత్రించడమే మన లక్ష్యం కావాలని ఇందుకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ఎంతో కీర్తించదగినదని చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమర్థవంతమైన మోదీ నాయకత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని తాము నమ్ముతున్నామన్నారు. చంద్రబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే..

- రాజకీయాలకు అతీతంగా కరోనా కట్టడికి సమిష్టి పోరాటం చేయాలి. దీనిపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలి.
- ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం, ఏప్రిల్‌ 14 తర్వాత ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- ఇతర దేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వ సూచనలను ప్రజలు పాటించాలి. పోలీసులకు సహకరించాలి. 80 ఏళ్లు పైబడిన వారు జాగ్రత్త. సరిహద్దుల దగ్గరకు వచ్చి ఇబ్బందులు కలిగించవద్దని కోరుతున్నా.  

మరిన్ని వార్తలు