మీరో, మేమో తేల్చుకుందాం..

20 Dec, 2019 03:36 IST|Sakshi

ఎక్కడికి రావాలో చెప్పండి సిద్ధంగా ఉన్నాం

పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శ

అనంతపురం: ‘‘ధైర్యం ఉంటే పోలీసు వ్యవస్థను పక్కనపెడదాం, మీరో మేమో తేల్చుకుందాం. ఎక్కడికి రావాలో చెప్పండి సిద్ధంగా ఉన్నాం. మీమాట వినే పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. భయపడతారు అనుకున్నారు. మనవాళ్లు ఇంకా కసితో రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదిలిపెట్టను’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చెలరేగారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రెండోరోజు వివిధ కేసులు నమోదైన టీడీపీ వారితో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఆర్నెల్లలో 650 దాడులు జరిగాయన్నారు. ఈరోజో, రేపో, ఎల్లుండో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, నష్టపోయిన వారికి వడ్డీతో సహా పరిహారం కట్టించే బాధ్యత తనదని చెప్పారు.

నేను అనుకుంటే వైఎస్సార్‌సీపీ నేతలు ఉండేవారా?
వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉండకూడదని తాను అప్పట్లో అనుకుని ఉంటే ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగిలేవారు కాదన్నారు. ఒక రాజకీయ పార్టీ, మరో రాజకీయ పార్టీ కొట్లాడుకుంటే బలం ఏంటో తేలిపోతుందన్నారు. కొందరు పోలీసులు పనికట్టుకుని తమపై దాడులు చేస్తున్నారని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే తమ వారి కేసులు తీసుకోవట్లేదన్నారు.  సీఎం వ్యాపారాలు చేసుకుంటూ టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు