అమరావతి...46వ అంతస్తు

27 Mar, 2018 20:30 IST|Sakshi

అమరావతి ... ఆకాశాన్ని ముద్దాడుతున్న పెద్ద పెద్ద భవనాలు. ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నట్టు... అందులో మరింత ఎత్తెన భవనం... దాంట్లో 46వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం... చుట్టూ అద్దాలు... ఎటువైపు నుండి చూసిన కనుచూపు మేరలో  భవనాలు... పై నుండి చూస్తే  చీమల్లా మనుషులు, కార్లు... నదీ గర్బంలో కట్టుకున్న క్యాంపు కార్యాలయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 46వ అంతస్తుపైన నిర్మించిన హెలిప్యాడ్‌లో నేరుగా దిగి కార్యాలయంలోకి ముఖ్యమంత్రి.... ఊహ బాగుంది కదా.  కలల బేహారి కలల్లో నిర్మించుకున్న రాజధానిలో ఆకాశమార్గాన పయనం మబ్బుల్లో తేలిపోతున్న ఫీలింగ్‌.. మరి ఇందులో ప్రజల ఎక్కడ?. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలెక్కడ.

ఓసారి 14ఏళ్ల  వెనక్కి వెళదాం.  ప్రజల మద్దతుతో గెలిచి ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలపై ప్రజల సమక్షంలో సంతకం చేసిన ఆ క్షణాలు. 46వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయమట అంటూ ఒక వార్త చదివిన మరుక్షణం గుర్తుకు వచ్చాయి.  అప్పటివరకు ముఖ్యమంత్రికి ప్రత్యేక నివాసం అంటూ ఏదీ లేదు.  ప్రజలతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా కలుసుకునే వెసులుబాటు లేదు.  ఆలోచన వచ్చిందే తడవు క్యాంప్‌ కార్యాలయం రూపుదిద్దుకొంది.  ప్రజలతో రాజశేఖర్‌ రెడ్డి  ప్రతీరోజు ఉదయం కలిసేవారు.  సమస్యలు వినేవారు.

ప్రతీరోజు జన జాతరే... పిల్లలు, వృద్ధులు, యువకులు, రైతులు, విద్యార్థులు... సమస్యల వెల్లువ... కొన్నింటికి అప్పటికప్పుడే పరిష్కారం మరికొన్నింటికి అధికారులకు ఆదేశాలు.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో నిలిచిపోయిన ప్రజోపయోగా కార్యక్రమాలకు ఆలోచన, అంకురార్పణ జరిగింది అక్కడే.  ప్రతీ రోజు ఆ  పగటిపూట సెక్రటేరియట్‌ సమతా బ్లాక్‌లో ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలకు భరోసా అనేది అవగతమైందీ అక్కడే విధినిర్వహణలో భాగంగా ప్రత్యక్షంగా చూసిందీ... తెలుసుకుందీ అక్కడే.

అలాంటి రోజుల నుండి ముఖ్యమంత్రులు గిరిగీసుకొని తమ చుట్టూ వలయాల్ని ఏర్పరచుకొని ప్రజల జ్ఞాపకాల్లోంచి మాయమైన రోజులు కూడా చూసింది అక్కడే.

ఇపుడేమో... ముఖ్యమంత్రి 46వ అంతస్తు నుండి పనిచేస్తారట ( అమరావతి అంటూ నిర్మాణం జరిగితే... ఇంకా డిజైన్ల దగ్గరే ఉంది కదా).  నిజంగానే ముఖ్యమంత్రి 46వ అంతస్తు నుండి పనిచేస్తే పరిస్థితి ఏమిటి?  అందులోకి సామాన్య ప్రజలను అనుమతిస్తారా.. వారిని అసలు దరిదాపుల్లోకి అయినా రానిస్తారా.. మామూలు ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం కలుగుతుందా... అసలు ముఖ్యమంత్రిని కనీసం దూరం నుండి అయినా ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తుందా... గాలిలో ప్రయాణించి మేఘాల్లోంచి పనిచేసే ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు తెలుస్తాయా... డాష్‌బోర్డ్‌... టచ్‌స్క్రీన్, కీబోర్డ్‌ ,ఇంటర్‌నెట్‌ మాయలో ప్రజలకు దూరంగా జరిగితే కష్టాలు తెలుస్తాయా!

సింగపూర్‌ నిలువుగా ఎందుకు పెరిగింది.  మరోరకంగా విస్తరించడానికి భూమిలేదు కాబట్టి.. ఇక్కడేమో రైతుల మెడమీద కత్తిపెట్టి బలవంతంగా లాక్కున్న 30,000 వేల ఎకరాల  భూమి ఉంది.  మరి ఎందుకింత సింగపూర్‌ యావ... అభివృద్ధి అంటే ఎత్తెన భవనాలు అని మాత్రమే నమ్మే పాలకులు... ప్రజలకు దూరంగా జరుగుతన్న క్రమం స్పష్టంగా కనపడుతోది. అభివృద్ది అంటే రైతులు సంతోషంగా ఉండటం... యువకులు ఉద్యోగాలు చేయడం... కర్మాగారాలు పని చేయడం... ప్రాజెక్టులు నిజంగా పూర్తికావడం... ఇవన్ని చూడటానికి ప్రజల మధ్యలో భూమార్గంలో ప్రయాణించడం అవసరం... రోడ్డు మీద వెళితే భూమికి కాళ్లకీ మధ్య అహం గాలి దూరకుండా ఉంటే రోడ్డు పక్కన దీనంగా నిలబడ్డ అమాయకపు ప్రజలో, ఉరి కంబానికి వేళడటానికి సిద్దంగా ఉన్న నిరుద్యోగ యువకుడో.  చేనులో చల్లాల్సిన మందును గొంతులో ఒంపుకోవడానికి దిగాలుగా దిక్కులు చూస్తున్న రైతులో కనపడతారు.  46వ అంతస్తు పైనున్న హెలిప్యాడ్‌ నుండి చూస్తే దూరపు కొండలు నునుపుగానే కనపడతాయి.  46వ అంతస్తులో ఉండే పాలకులు కావాలో ప్రజల మధ్య గడిపే నాయకులు కావాలో నిర్ణయించుకోవాల్సింది ప్రజలే... ఓటర్లే... ఏమవుతుందో చూద్దాం...

ఎస్‌.  గోపీనాథ్‌ రెడ్డి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా