ఓటమి సంకేతాలతో విచక్షణ మరిచారు

12 Apr, 2019 07:58 IST|Sakshi
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

పోలింగ్‌ రోజు బాబు అసహనంపై సర్వత్రా విస్మయం

తొలి గంటలోనే రీపోలింగ్‌కు బాబు డిమాండ్‌

పదేపదే పత్రికా ప్రకటనలతో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం

సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు మెదులుతుండడంతో కొద్దిరోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్న చంద్రబాబు.. గురువారం పోలింగ్‌ రోజు సైతం మరింత రెచ్చిపోయి విచక్షణ లేకుండా వ్యవహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌ మొదలైన తొలి గంటలోగానే ఈవీఎంలు పనిచేయడం లేదనే సాకు చూపి రీపోలింగ్‌ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడం, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో టీడీపీ శ్రేణులే నివ్వెరపోయాయి. పోలింగ్‌ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే హడావుడి చేయడం, రీపోలింగ్‌ అడగడం ద్వారా చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్లయిందంటూ ఆ పార్టీ నాయకులే చర్చించుకున్నారు. 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, ఇది దారుణమని చెప్పడం ద్వారా ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఇది చంద్రబాబులోని అభద్రతా భావాన్ని బయటపెట్టిందనే వ్యాఖ్యలు విన్పించాయి. మూడు వేల ఈవీఎంలు పనిచేయడం లేదని చంద్రబాబు ప్రకటించడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరోవైపు సైకిల్‌కు ఓటేస్తే ఫ్యానుకు పడుతోందని చెప్పడం, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా తన స్థాయి మరచిపోయి గల్లీ నాయకుడిలా ప్రవర్తించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  మరోవైపు ఉదయం నుంచి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పదేపదే పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ద్వారా ఓటర్లను గందరగోళపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు. వీడియో సందేశాలు విడుదల చేసి ఎన్నికల నిర్వహణలో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ తానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఆయన వైఖరితో ఆశ్చర్యపోవడం ఎన్నికల అధికారుల వంతైంది. అలాగే టీడీపీ క్యాడర్‌తో చంద్రబాబు గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడుతూ ఘర్షణలకు పురికొల్పారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటింగ్‌ జరుగుతోందని, దాన్ని అడ్డుకోవాలని ఆయనతోపాటు ముఖ్య నాయకులు పదేపదే స్థానిక నాయకత్వానికి సూచనలు పంపారు. దీని వల్లే ఓడిపోతామనే భయం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు  వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ రక్తసిక్తం కావడానికి, ఉద్రిక్తతలు ఏర్పడడానికి చంద్రబాబు క్యాడర్‌కు ఇచ్చిన సూచనలే కారణమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు