టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు!

21 Apr, 2018 15:53 IST|Sakshi

తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియో వైరల్

బొండా ఉమా హిట్లర్.. అతడు బోర్డ్ మెంబరా?

ఏపీ ప్రభుత్వంపై బ్రాహ్మణ సంఘాల మండిపాటు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు.  అనిత వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన వీడియోను ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండానిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ పాలక మండలిని నియమించడానికి ముందుగానే ప్రభుత్వం సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. 

బొండా ఉమా హిట్లర్.. అతడు అనర్హుడు
టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు విజయవాడ బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం బ్రాహ్మణ సంఘాలే. కానీ  గెలిచినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. బొండా ఉమాకు ఆలయ వైదిక ధర్మాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి టీటీడీ పదవులు కట్టబెట్టడం బ్రాహ్మణులను కించపరచడమే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొండా ఉమా ఒక హిట్లర్ అని.. ఆయనకు అన్ని పదవులు కట్టబెట్టడం దుర్మార్గమని బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను‌... బోర్డు సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమా సహా మరికొందరిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే.


వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం..

మరిన్ని వార్తలు