మేజరు కాదు మైనరే..

13 Sep, 2018 13:36 IST|Sakshi
పోర్టు ఏర్పాటు చేయనున్న ప్రాంతం

రామాయపట్నం పోర్టుపైదొంగాట

మినీ పేరుతో అభివృద్ధికి విధ్వంస కుట్ర

భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం నిర్మాణానికి శాశ్వత సమాధి యత్నాలు

కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మేలు కోసమే!  

ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ నెల 21న ‘థాంక్స్‌ చంద్రబాబు’ కార్యక్రమానికి టీడీపీ సన్నాహాలు

అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లు రామాయపట్నం పోర్టు విషయంలో కాలక్షేపం చేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. మినీపోర్టు పేరుతో ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లా వాసులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రాలకు అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. పోర్టు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ముందుకు వచ్చింది. మరి ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో చంద్రబాబు రూ.17,615 కోట్లు కాదని, రూ. 4,500 కోట్లతో మినీపోర్టు నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇంత హడావుడిగా 11వ తేదీన జీఓ విడుదల చేయడం వెనుక భారీ కుట్రదాగి ఉందని, ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేలా బాబు సర్కార్‌ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం తీరుగా ఉందని రాజకీయవర్గాలు మండి పడుతున్నాయి. పోర్టు ఏర్పాటు కోసం వైఎస్సార్‌ సీపీ నేతలు నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు.

నెల్లూరు, కావలి: కేంద్ర ప్రభుత్వం 2011లో దేశంలో తూర్పు సముద్ర తీరప్రాంతమైన బంగాళాఖాతం ఒడ్డున రెండు భారీ ఓడరేవులను నిర్మించాలని నిర్ణయించింది. అందులో ఒకటి పశ్చిమ బెంగాల్, మరొకటి మన రాష్ట్రానికి కేటాయించింది. రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాలను పరిశీలించిన నిపుణులు కమిటీ చివరకు రామాయపట్నం తీరం భారీ పోర్టు కమ్‌ షిప్‌ యార్డుకు అన్ని రకాలుగా సానుకూలమని నివేదికలు ఇచ్చారు. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్‌ లాబీయింగ్‌ చేసి దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూపీఏ సర్కార్‌ 2013 మేలో దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కిరణ్‌ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో ఆ నిర్ణయం ప్రకటనకే పరిమతమైంది.

తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్‌ దాదాపు సంవత్సరం పాటు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2015 జూలైలో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు మొత్తం రూ.17,615  కోట్లు ఖర్చు అవుతుందని, తొలి విడతలో రూ.6,091 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, ఇక తాము మాత్రం చేయగలిగింది ఏముందని స్పష్టంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా  పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌లో భారీ ఓడరేవుకు సర్వే చేసిన నిపుణుల బృందం చెన్నై ఐఐటీకి చెందిన సముద్ర నిపుణుల బృందం రాష్ట్రంలోని నక్కపల్లి, రామాయపట్నం, దుగరాజుపట్నంను సర్వే చేసింది. రామాయపట్నంలో రెండు నెలలు పాటు మకాం వేసి సర్వే చేశారు. సముద్రంలో కొంత లోపలికి వెళ్లి అక్కడి నుంచి మూడు కిలో మీటర్లు వరకు కావలి వైపు ఉన్న తీరం వైపుగా సర్వే చేశారు. ఆ సర్వేలో అన్ని విధాలుగా రామాయపట్నం తీరమే పోర్టు నిర్మాణానికి సాంకేతికంగా అనువైనదిగా నివేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.  రైట్స్‌ అనే సంస్థ కూడా ఇదే అభిప్రాయంతో కూడిన నివేదికను ప్రభుత్వాలకు అందించింది. రామాయపట్నం తీరంలో సముద్రం 20 మీటర్ల లోతు కలిగి ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా నిపుణులు తేల్చారు. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక సర్వే సంస్థ కూడా రామాయపట్నమే అన్ని విధాలుగా లాభదాయకమని, భద్రత పరంగా క్షేమమని తేల్చేసింది. ఇన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నంలో పోర్టు కమ్‌ షిప్‌ యార్డ్‌ నిర్మాణానికి అధికార టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లున్నర ఏళ్లుగా నోరెత్తడానికి సాహసించలేకపోయారు.

గేమ్‌ ఆడిన చంద్రబాబు ప్రభుత్వం
పశ్చిమబెంగాల్‌లో నిర్మిస్తున్న పోర్టులో 74 శాతం కేంద్రం వాటా కాగా 26 శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. ఇందుకు విరుద్ధంగా ఉండేలా చంద్రబాబు సర్కార్‌ ఓ పథకాన్ని వేసింది. కేంద్ర పాలసీనీ మార్చేలా సిద్ధమైంది. పోర్టుకు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం, పునరావాసం, మౌలిక వసతులు అభివృద్ధి తదితర అన్నింటికి లెక్కలు కట్టి నిధులను కేంద్రం ప్రభుత్వం నుంచి తీసుకు రావాలనుకుంది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వాటాదారుడుని తీసుకొచ్చి ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కల్పించాలని స్కెచ్‌ వేసింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన లాబీయింగ్‌ను కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది.  

ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం చివరిగా ఈ ఏడాది మే 4వ తేదీ దుగరాజపట్నం బదులుగా మరో ప్రాంతాన్ని సూచించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలాంటి లేఖలు అప్పటికే మూడు రాసింది. అయినప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మే 12వ తేదీన  ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిపై రాష్ట్ర అధికారులు ఏమీ తేల్చకుండా కేంద్రంపై వదిలేశారు. ఎక్కడ నిర్మించాలో మీరే చెప్పండని నిర్ణయం కేంద్రం కోర్టులో వేసి కాలక్షేపం చేసింది. రామాయపట్నంలో భారీ ఓడ రేవు, నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయకుండా అటకెక్కించారు.

హడావుడి నిర్ణయం వెనుక
మినీపోర్టు నిర్ణయం వెనుక ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం పోర్టు నిర్మాణాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలన్న కుట్రదాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. సమీపంలో ఉన్న కృష్ణపట్టణం పోర్టుకు మేలు చేసేలా ఉందని నిపుణులు అంటున్నారు. అసలు బుల్లి పోర్టుకు సంబంధించి రామాయపట్నంలో నిర్మాణ పనులు ఇప్పుడు ప్రారంభిస్తే కనీసం మొదటి జెట్టీ (ఓడలు వచ్చే ఆగే ప్లాట్‌ఫాం) అందుబాటులోకి వచ్చే సరికి మూడేళ్లు పడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త జీఓ లోనే బుల్లి పోర్టు నిర్మాణానికి నిధులు, నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అధికారులు ఎంత వేగంగా పనులు చేసినా ప్రతిపాదనలు రూపొందించాలంటే కనీసం మూడు నెలల నుంచి నాలుగు నెలల పడుతుంది. ఈలోగా ఎన్నికల సమయం వచ్చేస్తుంది. దీంతో శాశ్వతంగా పోర్టుకు ప్రతిపాదనలు సమాధి చేసేందుకు జరిగిన కుట్రగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బుల్లిపోర్టు నిర్మిస్తామంటూ ఎంచక్కా ప్రచారం చేసుకునేందుకు స్థానిక నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న ‘థ్యాంక్స్‌ టు చంద్రబాబు’ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలను మోసం చేసేందుకు హడావుడి చేస్తున్నారు. స్థానిక నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

మరిన్ని వార్తలు