చంద్రబాబు విఫలం

7 Mar, 2016 03:22 IST|Sakshi
చంద్రబాబు విఫలం

మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 200 మంది చేరిక

 
కారంపూడి :  రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చారని, ఆయన అనుభవం పెరిగేకొద్దీ పాలనలో ఘోరంగా విఫలమవుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒప్పిచర్ల గ్రామంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పక్షపాత పాలనకు చంద్రబాబు తెరతీశారని ఆయన అన్నారు. అన్నీ అయిన వారికే అన్న చందంగా పాలన సాగిస్తూ ఏ పార్టీకి చెందని సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు.

జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు మేలు చేస్తూ, సామాన్య ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. చివరకు ఎమ్మెల్యేలకు అందించే ఏసీడీపీ గ్రాంటులను కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పేదే నిజమైతే, వారితో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణయ్య, మాజీ ఎంపీపీ పంగులూరి చినవెంకటనర్సయ్య పాల్గొన్నారు.  

 వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు                                                  
ఒప్పిచర్ల శివారు ఎర్రపాలెం గ్రామానికి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఎమ్మెల్యే పీఆర్కే సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారి ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లి పలకరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారు. పార్టీ మండల కన్వీనర్ పంగులూరి రామకృష్ణయ్య, గ్రామ అధ్యక్షుడు ఆముదాలపల్లి రవి తదితర నాయకుల సమక్షంలో గ్రామస్తులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీకి ఓటు వేసి ఎరుగని ఎర్రపాలెం గ్రామస్తులు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరడంపై స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్కే మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.

>
మరిన్ని వార్తలు