కృష్ణాకే గతిలేదు.. గోదావరి నీళ్లంట!

28 Mar, 2019 10:38 IST|Sakshi
వరుస కరువులతో బీడుగా మారిన పొలాలు, చెరువునీరు వదలక భూగర్భజలాలు లోతుకు పోయి, ట్యాంకర్లవద్ద ఎగబడుతున్న జనం

సాక్షి,పోరుమామిళ్ల : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేశారు.వెలుగొండ నుంచి గోదావరి నీళ్లు తెప్పిస్తామని మొన్న బద్వేలులో జరిగిన సభలో పేర్కొన్నారు. పూర్తయిన బ్రహ్మంసాగర్‌కు కృష్ణాజలాలు ఇవ్వడం అంతంతమాత్రమే.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మళ్లీ గోదావరి పల్లవి అందుకున్నారు.గోదావరి జలాలు ఎలా తెస్తారో అయనకే తెలియాలి. వైఎస్సార్‌సీపీ నేతలు బ్రహ్మంసాగర్‌ నుంచి నీరందని పొలాలకు వెలుగొండ నుంచి అందించాలని నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తదుపరి కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పించడంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సఫలీకృతులయ్యారు.

ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు ఏనాడూ దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికళ వేళ ఇలా ప్రకటన చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈసారి ఆయన మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. నందమూరి తారక రామారావు ప్రసాదించిన వరం తెలుగుగంగ ప్రాజెక్టు, బ్రహ్మంసాగర్‌ చంద్రబాబు పాలనలో కనుమరుగైన సంగతి ప్రజలు మరిచిపోలేదు. 

వైఎస్‌ జలయజ్ఞంతో బద్వేలుకు తెలుగుగంగ జలాలు
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యంతో మళ్లీ పురుడు పోసుకుంది తెలుగుగంగ ప్రాజెక్టు. జలయజ్ఞంతో కుడి, ఎడమ కాలువలు పూర్తయ్యాయి. బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలు చేరాయి. బద్వేలు ప్రజలు కష్ణాజలాలు కళ్లారా చూశారు. పంటలు సాగు చేశారు. ఆ నాయకుడు అనంతలోకాలకు వెళ్లడం, చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ గ్రహణం పట్టిందంటున్నారు ప్రజలు.ఉత్తరాదిన కురిసిన భారీ వానలకు వరదలు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు చేరినా బ్రహ్మంసాగర్‌కు కనీసం 10 టీఎంసీ నీరివ్వలేదు. 17 టీఎంసీ సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌కు 5 టీఎంసీలతోనే సరిపెట్టారు. ఆ నీరు కూడా ఆర్‌టీపీపీకి తరలించారు. లక్షా అరవై అయిదు వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు 2005లో వైఎస్‌ హయాంలో పూర్తయింది. కాలువలు తయారై పుష్కరకాలం గడచినా ఒక్క ఎకరా భూమికి నీరు అందలేదు. 

అమ్మకు అన్నంపెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులంటే నమ్మాలా?
పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు మూడు టీఎంసీలు ఇస్తే యాభైవేల ఎకరాలు సాగుకు నోచుకుంటాయి. బ్రహ్మంసాగర్‌కు 10 టీఎంసీలు వదిలితే లక్ష ఎకరాలు సాగవుతాయి. రెండు పట్టణాల ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఇందుకు కష్ణా జలాలే చాలు. మళ్లీ గోదావరి దాకా పోవాల్సిన అవసరం లేదు. కష్ణా నీరు ఇవ్వని ముఖ్యమంత్రి గోదావరి జలాలు తెస్తాడంటే జనాలు నవ్వరా? అమ్మకు అన్నం పెట్టనోడు అత్తకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతారా? అచ్చం అలాగే ఉంది చంద్రబాబు వైఖరి.

శ్రీశైలం నుంచి సకాలంలో నీరు వదిలితే బద్వేలులో కరువు ఉండదు. అందుకు శాశ్వత జీఓ విడుదల చేయాలి. అదేం చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. బద్వేలు ఓటర్లనే కాదు రాయచోటి ఓటర్లను మాయ చేసేందుకు వారికి కష్ణాజలాల ఎర వేశారు. ఓటర్లు చంద్రబాబు గారడీలకు మోçసపోయేందుకు సిద్ధంగా లేరనే వాస్తవం ఆయన తెలుసుకొనే సమయం చాలా దగ్గరలోనే ఉందని పలువురు పేర్కొంటున్నారు.

వెలుగొండ నీళ్లు కూడా ఇస్తాడట
1996లో చంద్రబాబే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని మరచిపోయారు. వెలుగొండ వల్ల పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లోని 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇది ఇప్పటి కల కాదు. నాలుగు దశాబ్దాల పోరాటం. అయినా పూర్తి కాలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోంది. 

మరిన్ని వార్తలు