బాబూ.. గుర్తుందా?!

2 Mar, 2019 13:31 IST|Sakshi
పిచ్చిమొక్కలతో నిండిన సి.బెళగల్‌ చెరువు

సి.బెళగల్‌ చెరువు ఎత్తిపోతలకు గతంలో చంద్రబాబు శంకుస్థాపన

20 ఏళ్లుగా శిలాఫలకానికే పరిమితం

చెరువుకు అందని తుంగభద్ర నీరు

సాగుకు నోచుకోని ఆయకట్టు

గుండ్రేవులనూ ఇలాగే వదిలేస్తారంటున్న రైతులు

1999 జూన్‌ 25.. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుడు కూడా ఎన్నికల సమయం కావడంతో హడావుడిగా పలు శంకుస్థాపనలు చేశారు. అందులో సి.బెళగల్‌ చెరువు ఎత్తిపోతల పథకం కూడా ఒకటి. దీని నిర్మాణం కోసం  సి.బెళగల్‌ ఎంపీడీఓ కార్యాలయం పక్కనే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ పథకాన్ని చేపట్టలేదు. ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. శిలాఫలకం మాత్రం చంద్రబాబు ‘20 ఏళ్ల’ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. నేడు వేదవతి, ఆర్డీఎస్‌ కుడికాలువ, గుండ్రేవుల అంటూ వస్తున్న ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.

కోడుమూరు: సి.బెళగల్‌ చెరువుకు తుంగభద్ర నీళ్లు కలగానే మిగిలాయి. ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరైపోయాయి.  చంద్రబాబు ఇరవై ఏళ్ల నాడు సీఎం హోదాలోనే ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదు. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ గురురాఘవేంద్ర మళ్లింపు పథకంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలోనిసి.బెళగల్‌ చెరువును కూడా తుంగభద్ర నది నీటితో నింపుతామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 1999 జూన్‌ 25న శంకుస్థాపన చేశారు. అప్పట్లోనూ రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో సి.బెళగల్‌ ఎంపీడీఓ కార్యాలయం పక్కనే హడావుడిగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1999లో టీడీపీ అధికారంలోకొచ్చి.. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు. అయినప్పటికీ ఈ ఎత్తిపోతల పథకం ఊసే లేదు. శిలాఫలకం వేసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. పథకం పనులు మాత్రం అడుగు కూడా ముందుకు కదల్లేదు.

పాదయాత్రలో చూసి.. మరోసారి మాట తప్పి
2012 అక్టోబర్‌ 25న ప్రతిపక్ష నేత హోదాలో ‘మీకోసం వస్తున్నా’ అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ప్రజలు చూపించారు.  తనను ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తే ఈ పథకాన్ని పూర్తి చేస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. అయితే..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఐదేళ్లు అవుతున్నా నేటికీ పథకాన్ని  పట్టించుకోలేదు. స్థానిక నేతలు ఈ విషయాన్ని చంద్రబాబుకు కొన్ని సందర్భాల్లో గుర్తు చేసినప్పటికీ నిధుల కొరత సాకుగా చూపి దాటవేసినట్లు తెలిసింది. ఈ పథకం ఏర్పాటు చేసివుంటే పదివేల ఎకరాలకు సాగు నీరు అందడమే కాకుండా..  24 గ్రామాల్లో తాగునీటి కొరత తీరేది. సి.బెళగల్‌ చెరువు జిల్లాలోనే అతిపెద్దది. దాదాపు 1,722 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తే ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ సీజన్లలో  ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సి.బెళగల్‌ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం వస్తోందని రైతులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ 20 ఏళ్లుగా ఆ ఆశ నెరవేరలేదు. స్వయాన చంద్రబాబు శిలాఫలకం వేసినా..ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.  

పిచ్చిమొక్కలు పెరిగి..
చెరువులో నీళ్లు లేక ఒండ్రు మట్టి పేరుకుపోయింది. ఎటుచూసినా పిచ్చి మొక్కలు పెరిగాయి. ఉనికి కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది. సి.బెళగల్‌ మండల సరిహద్దులోనే తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఏటా లక్షలాది క్యూసెక్కుల నీరు కింది ప్రాంతాలకు తరలిపోతోంది. బెళగల్‌ మండల వాసులు మాత్రం సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

మరో మోసానికి తెర
ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు మరో మోసానికి తెర లేపారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు గుండ్రేవుల రిజర్వాయర్‌ గురించి పట్టించుకోని ఆయన.. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ పథకానికి శంకుస్థాపన చేసేందుకు శనివారం కోడుమూరులో పర్యటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు