బాబూ నీతిమంతుడవైతేనే అవినీతిపై మాట్లాడు

1 Jan, 2014 05:45 IST|Sakshi

మద్దిపాడు, న్యూస్‌లైన్: చంద్రబాబూ నీవు నీతిమంతుడివైతే అవినీతి గురించి మాట్లాడవచ్చని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మద్దిపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మోరుబోయిన సంజీవరావు సుమారు 300 మంది కార్యకర్తలతో వైఎస్సార్ సీపీలో చేరుతున్న సందర్భంగా స్థానిక కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీబీఐ ఎంక్వయిరీ తప్పించుకునేందుకు సుప్రీం కోర్టుకు వెళ్లిన చంద్రబాబు అవినీతిని పారదోలతానంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. పంచాయతీ, సొసైటీ ఎన్నికల్లో తెలుగు-కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆవిర్భవించిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చంద్రబాబు లేఖ ఇచ్చి రాష్ట్రానికి రూ. 4 లక్షల కోట్లు ఇస్తే..తాను నిజాయితీగా పాలిస్తాననడం ఆయన అవివేకానికి తార్కాణమని దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోయేందుకు చంద్రబాబే కారణమన్నారు.
 
  బీజేపీతో కలిసిపోతే సీట్లు సంపాదించుకోవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అదే చంద్రబాబు 2004లో బీజేపీతో పొత్తు వల్లే తమ పుట్టి మునిగిందని గగ్గోలు పెట్టారని అన్నారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గెలిచి చూపాలని ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల పాటు అధికారానికి దూరం కావడంతో చంద్రబాబు పిచ్చి ఎక్కినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.  రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధాలు పెరుగుతాయని, సమస్యలు తీవ్రమవుతాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగలిగిన వ్యక్తి కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. బలహీనవర్గాలకు ఎప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ మంచి పటిష్టమైన పథకాలను అమలు చేయగలిగిన జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.  నియోజకవర్గ సమన్వయకర్త అమృతపాణి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు పెట్టగలిగిన సమర్థవంతమైన పార్టీ వైఎస్సార్ సీపీయేనన్నారు. సమన్వయకర్త అంగలకుర్తి రవి మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి వైఎస్సార్  సీపీని అధికారంలో తేవాలని కోరారు.
 
 మరో జిల్లా నాయకుడు చుండూరి రవి మాట్లాడుతూ చంద్రబాబు ఒంటెత్తు పోకడలతో తమను ఇబ్బంది పెట్టేవాడని, ఆయన ఇబ్బందులను తట్టుకోలేకనే తాము ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలోకి వచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మందా వందనం (చిన్న) చేరారు. కార్యక్రమంలో జిల్లా బీసీసెల్ కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, చీమకుర్తి మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు రొండ్లా నారపరెడ్డి, లింగారామకృష్ణారెడ్డి, బెజవాడ పూర్ణచంద్రరావు,  ఎస్‌డీ.మజీద్,  జిల్లెళ్లమూడి రమాదేవి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆర్. రమణమ్మ, వెల్లంపల్లి మాజీ సర్పంచ్ జయమ్మ, మరో మాజీ సర్పంచ్ పురాలశెట్టి చిన్న,  మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బొమ్మల శ్రీనివాసులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లకి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బాలినేని నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. బాలినేని మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు