‘చంద్రబాబు అక్రమాస్తుల’ కేసు 26కు వాయిదా

15 Feb, 2020 03:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఫిర్యాదు దశ లో చంద్రబాబు తరఫు వాదనలు వినరాదని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది గతంలో చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఫిర్యాదుపై 26న తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం జడ్జి తెలిపారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై 2005లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు.

అప్పట్లో టీడీపీ అధినేత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొంది ఈ ఫిర్యాదుపై విచారణ జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు గతేడాది  జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలేనని తేల్చిచెప్పింది. తిరిగి స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకపోతే గతంలోనే స్టే రద్దయినట్లేనని పేర్కొంది. దీనికనుగుణంగా తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు గత విచారణలో చెప్పింది. దీనిపై లక్ష్మీపా ర్వతి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. దీంతో ఎలాంటి వాదనలు లేకుండానే ఈ నెల 26కు వాయిదా పడింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా