ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం

2 Mar, 2017 11:39 IST|Sakshi
ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ  భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉదయం 11.25 గంటలకు సీఎం భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు సమావేశ మందిరాలు, ఛాంబర్లు, లాబీలు పరిశీలించారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సొంతగడ్డపై శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్న తన కల నెరవేరిందన్నారు. ప్రజా సమస్యలపై సభలో విస్తృతమైన చర్చ జరగాలన్నారు. కాగా మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాంగణంలోనే జరగబోతున్నాయి.

ఒకే సముదాయంలో అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఏర్పాటు చేశారు. రికార్డ్‌ సమయంలో ఈ భవనాలను ఎల్‌అండ్‌టీ, సీఆర్డీఏ సంస్థలు నిర్మించాయి. సచివాలయ ప్రాంగణంలో ఆరో భవనంగా అసెంబ్లీ, మండలి నిలవనున్నది. మొత్తం 260 మంది సభ్యులు కూర్చునేలా అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస‍్తుత ప్రాతినిధ‍్యం 50 మంది అయినా... 90 మంది సభ్యులు కూర్చునేలా శాసనమండలి భవనాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి చైర్‌ అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతోంది. ఏడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీకర్‌ చైర్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.

సభ్యుల కుర్చీల వద్ద సెన్సార్‌ మైక్‌ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. భాషా అనువాద సదుపాయం కూడా ఉంది.  అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మొత్తం ఐదు అత్యాధునిక గ్యాలరీల్లో 2 మీడియాకు, ఒకటి అధికారులకు, ఒక్కొక్కటి చొప్పున మరో రెండు వీఐపీలకు కేటాయించారు. మొదటి అంతస్థులో ఐదు పార్టీలకు శాసనసభ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో మూడు పార్టీల ప్రాతినిథ్యం మాత్రమే ఉంది.