గవర్నర్‌కు అవమానం

12 Nov, 2018 10:16 IST|Sakshi

సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన చంద్రబాబు

గవర్నర్‌ను స్వయంగా ఆహ్వానించకుండా మంత్రిని పంపిన సీఎం

మంత్రివర్గ విస్తరణపై స్వయంగా చర్చించకుండా లేఖ పంపిన వైనం

ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారన్న విమర్శలు

రాజ్యాంగబద్ధ పదవిలోని గవర్నర్‌ను అవమానించారంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అగౌరవపరిచే రీతిలో ముఖ్యమంత్రి  చంద్రబాబు వ్యవహరించారు. సంప్రదాయబద్ధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు సీఎం స్వయంగా గవర్నర్‌ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పి చర్చించడం ఆనవాయితీ. స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి అమరావతికి వచ్చిన గవర్నర్‌ను స్వయంగా ఆహ్వానించాల్సివుంది. కానీ ఈ రెండు ఆనవాయితీలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు.  ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న విషయంపై చంద్రబాబు నేరుగా వెళ్లి గవర్నర్‌తో చర్చించకుండా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుండి అధికారుల ద్వారా రాజ్‌భవన్‌కు లేఖద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు కొత్తగా ఇద్దరు మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించేందుకు గవర్నర్‌ ఆదివారం ఉదయం విజయవాడ నగరానికి వచ్చారు. ఆయన బస చేసిన చోటుకు ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే ఉండవల్లికి స్వయంగా తీసుకెళ్లాల్సివుంది. కానీ చంద్రబాబు మంత్రి  పుల్లారావును గవర్నర్‌ వద్దకు పంపి అవమానకరంగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేసి నివేదిక కోరడాన్ని తప్పుపట్టిన టీడీపీ, ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించింది.

గవర్నర్‌ను బీజేపీ ఏజెంటుగా మంత్రులు, టీడీపీ నాయకులు ఆరోపించగా, చంద్రబాబు సైతం ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనకు సీఎం నేరుగా చెప్పలేదు.  ఇలా చేయడం ద్వారా చంద్రబాబు గవర్నర్‌పై తన అసంతృప్తిని, నిరసనను తెలిపినట్లు అనుకూల మీడియా రోజంతా ఊదరగొట్టింది. గతంలో గవర్నర్‌ పలుసార్లు అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా ఆయన బస చేసిన చోటుకు వెళ్లి ఆహ్వానం పలికి తీసుకెళ్లారు. ఇపుడు గవర్నర్‌కు ఆహ్వానం పలకడానికి రాకపోవడం ఆనవాయితీకి తిలోదకాలివ్వడమేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య రక్షణకని పలు రాష్ట్రాలు తిరుగుతున్న చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన గవర్నర్‌ను మాత్రం అవమానించడాన్ని  విశ్లేషకులు తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను అవమానించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం, తదనంతర పరిణామాలతోపాటు తిత్లీ తుపాను, రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు