ఈ పరిస్థితికి చంద్రబాబే కారణం

5 Oct, 2013 06:35 IST|Sakshi

నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రస్తుతంనెలకొన్న అల్లకల్లోల పరిస్థితులకు ప్రధాన కారణం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబేనని నరసన్నపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఘోర అవమానానికి పాల్పడ్డారన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజావసరాలు, ప్రజల మనోభావాలు గుర్తించకుండా విభనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. 65 రోజుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే కేంద్ర నాయకులు ప్రాధాన్యమివ్వకుండా, వారు చెప్పిన ఆంటోనీ నివేదిక తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా నోట్‌కు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు.
 
 కాంగ్రెస్ వ్యతిరేకత కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతుందని కాంగ్రెస్‌వాదులు అనుకోవడం వారి అవివేకమన్నారు. జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించినా ఫలితం లేకపోవడంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు వివరిస్తారని, దీని ఫలితం దేశమంతటా కాంగ్రెస్ చూపుతుందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఎదుర్కొక తప్పదని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్‌ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్పందించిన పార్టీ వైఎస్సార్‌సీపీయేనని ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని కోరారు.
 
 తెలంగాణాను అడ్డుకునేందుకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయని, కోర్టుతో పాటు రాష్ట్ర శాసన సభ, ఆమోదం, పార్లమెంట్‌ల్లో ఆమోదం వంటి దశలు ఉన్నాయన్నారు. టీ నోట్‌తో ప్రజలు నిరుత్సాహపడవద్దని కృష్ణదాస్ కోరారు.

మరిన్ని వార్తలు