అధికారులు సహకరించారా?!

20 Apr, 2019 12:22 IST|Sakshi
టీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు

జిల్లా నాయకులతో చంద్రబాబు ఆరా

రాక్‌గార్డెన్‌లో టీడీపీ అభ్యర్థులతో సమావేశం

సగం మంది గైర్హాజరు  

కర్నూలు: ఎన్నికల్లో జిల్లా అధికారులు మనకు సహకరించారా, లేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులతో ఆరా తీశారు. ఈవీఎంలు ఎక్కడెక్కడ మొరాయించాయి? అధికారులు వెంటనే స్పందించారా, లేదా? మనకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించారా? వంటి విషయాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆయన శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు స్వాగతం పలికారు. అనంతరం రాక్‌గార్డెన్‌లోని పున్నమి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.

ఇక్కడే ఆ పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశమై జిల్లాలో ఎన్నికల తీరుపై విశ్లేషించారు. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లూ తమకే వస్తాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ధీమా చెబుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మనం ఎన్ని గెలుస్తామో చెప్పండంటూ ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు అభ్యర్థి జయనాగేశ్వర్‌రెడ్డి, నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడానికి మీకు చేతగాలేదు. ఓటర్లకు డబ్బు కూడా సక్రమంగా పంచలేదు. ఇలాగైతే ఎలా’ అంటూ మందలించినట్లు తెలుస్తోంది. అలాగే రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ మెజార్టీ వస్తుందన్న విషయాన్నీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.  

సగం మంది గైర్హాజర్‌
జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తనను కలవాలంటూ స్వయంగా  చంద్రబాబు ఆదేశించినప్పటికీ సగం మంది  గైర్హాజరయ్యారు. పత్తికొండ, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, కర్నూలు, ఆదోని అసెంబ్లీ అభ్యర్థులు కేఈ శ్యాంబాబు, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కేఈ ప్రతాప్, టీజీ భరత్, మీనాక్షి నాయుడు తదితరులు సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైనట్లు తెలిసింది. అలాగే మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థి తిక్కారెడ్డి గన్‌మెన్‌ల ఫైరింగ్‌లో గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎం సమీక్షకు హాజరు కాలేకపోయారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు కచ్చితంగా అభ్యర్థులందరూ హాజరు కావాలని స్వయంగా అధినేత ఆదేశించినప్పటికీ సగం మంది డుమ్మా కొట్టడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. రాయచూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొన్న చంద్రబాబు..ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్లారు. 

మరిన్ని వార్తలు