చంద్రబాబు బతుకంతా దొంగ బతుకే : టీఆర్‌ఎస్

13 Sep, 2013 22:49 IST|Sakshi

చంద్రబాబునాయుడు బతుకే దొంగ బతుకు, చీకటి బతుకు అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు మందుల సామేలు, నాగేందర్, ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబుకు మతి చలించిందన్నారు. పూటకోమాట, నిమిషానికో డ్రామాతో సీమాంధ్రలోనూ టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై అవాకులు పేలుతున్నాడని విమర్శించారు.

టీఆర్‌ఎస్ కచ్చితంగా ఫాంహౌజు పార్టీయేనని, దానిపై సందేహమే వద్దన్నారు. చంద్రబాబు అనుసరించిన రైతు వ్యతిరేక ఆర్థిక విధానాలతో దెబ్బతిన్న రైతుల పక్షాన ఉద్యమించే పార్టీగా  టీఆర్‌ఎస్ అవతరించిందన్నారు. చంద్రబాబు మెదడే కుట్రలకు నిలయమని, టీడీపీ కుట్రల పార్టీ, కుతంత్రాల పార్టీ, బ్రోకర్ల పార్టీ, జోకర్ల పార్టీ, వైస్రాయ్ హోటల్‌లో పుట్టినపార్టీ, వెన్నుపోటుదారుల పార్టీ, ఊసరవెల్లుల పార్టీ ఇలా చెప్పుకుంటే వందల పేర్లు పెట్టొచ్చునని జగదీశ్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఆవిర్భావంలో లేని చంద్రబాబుకు టీడీపీపై హక్కే లేదన్నారు. టీడీపీలో చంద్రబాబును చేర్చుకోకుంటే ఎన్టీఆర్ ఇంకా బతికి ఉండేవారని పార్టీ నేతలు, నందమూరి కుటుంబసభ్యులు బయటకు చెబుతున్నారని వెల్లడించారు.

చంద్రబాబు వెన్నుపోటు వల్ల అవమానభారం, మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ మరణించారని చెప్పారు. ఇంతకుముందు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు చీకట్లో, రహస్యంగా సీడబ్ల్యూసీ సభ్యులను, యూపీ నేతలను రహస్యంగా కలిసి కాళ్లావేళ్లా పడి కేసులు వద్దని వేడుకున్నాడని గుర్తుచేశారు. ఈ విషయాన్ని పలుసార్లు కాంగ్రెస్ నేతలే వెల్లడించారని గుర్తు చేశారు. ‘చంద్రబాబు బతుకంతా చీకటి బతుకు. చీకట్లో రహస్యంగా వెళ్లి కుట్రలు పన్నడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఢిల్లీకి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా బయటకు చెప్పేదొకటి, చీకట్లో చేసేది మరొకటి. తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.

ఒక్క సోనియాగాంధీని తప్ప కాంగ్రెస్ అధిష్టాన ముఖ్యులతో మాట్లాడిండు. 2014 ఎన్నికల తర్వాత అవసరమైతే టీడీపీ ఎంపీలు  కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటారని, తెలంగాణను ఆపాలని చంద్రబాబు కుట్రలు చేసిండు. రాష్ట్రంలోనూ ఇతరపార్టీల నేతలతో చంద్రబాబు మాట్లాడిండు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన 4 రోజులకే సిగ్గూశరం లేకుండా చంద్రబాబు మాట మార్చిండు’ అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో, ఎవరెవరిని కలుస్తున్నాడో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పార్టీ అవసానదశలోనైనా చంద్రబాబునాయుడు పారదర్శకంగా ఉండాలని చంద్రబాబుకు సూచించారు. తెలుగుజాతిని కాపాడుకుంటానని, సమైక్యాంధ్ర ఉద్యమం గొప్పదని చంద్రబాబు అంటే తెలంగాణ టీడీపీనేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లేరా, తెలంగాణ ఉద్యమం గొప్పది కాదా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకోసం ఇన్నేండ్లు ఉద్యమాలు చేస్తుంటే ఏనాడూ స్పందించని చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమంతో ఢిల్లీకి వెళ్తున్నాడన్నారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబుకు ఏనాడూ సానుభూతి లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు