బడాయి మాటల బాబు

30 Mar, 2019 12:29 IST|Sakshi
హామీలకే పరిమితమయిన గుర్ల పీహెచ్‌సీ,  అధ్వానంగా ఆనందపురం, నడుపూరు రోడ్డు 

మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి కలేనా

ఐదేళ్లు పూర్తికావస్తున్నా అభివృద్ధి కాని గుజ్జింగివలస

సీఎం హామీలు నెరవేరక ప్రజల్లో అసంతృప్తి

సాక్షి, గుర్ల: ఎన్నికల ముందు, సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో, పర్యటనల్లో ఏదైతేనేం తెలుగుదేశం ప్రభుత్వం నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాల కు ప్రజలు బలైపోతున్నారు. సందర్భం వస్తే చా లు హామీలు ఉచితంగా ఇచ్చేయడం వాటిని అమలు చేయడానికి మాత్రం కొంటె సాకులు చెప్పి తప్పించుకోవడం టీడీపీ నాయకులకు ఆనవాయితీగా వస్తుంది. ఇలా హామీలిచ్చి తప్పించుకోవడంలో అగ్రగణ్యుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. సరిగ్గా నాలుగున్నరేళ్లు క్రితం హుద్‌హుద్‌ తుఫాన్‌ దాటికి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ పంటలను పరిశీలించడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుజ్జింగవలస గ్రామానికి వచ్చా రు. ఈ సందర్భంగా మండలానికి, గుజ్జింగవలస గ్రామానికి అనేక వరాల జల్లు కురిపించారు.

బాబు ఇచ్చిన హామీలివే...
మండల కేంద్రంలో ఆరు పడకల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చుతామని హామీ ఇచ్చా రు. డిగ్రీ కాలేజ్‌ లేదా అగ్రికల్చర్‌ కాలేజ్‌ని మం జూరు చేస్తామన్నారు. గుజ్జింగివలస గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని, యువతకు జిమ్‌ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. హుద్‌హుద్‌ తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు. అయితే వీటిలో ఏ ఒక్క హామీని అమలుచేయకపోవడంతో మండల ప్రజలు సీఎంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


వైఎస్సార్‌సీపీ నాయకులు పలుమార్లు ప్రశ్నించినా...
ఈ హామీలపై మండల సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీ నాయకులను పలుమార్లు ప్రశ్నించినా వారి దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. దీనికి తోడు ఏదో ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటివరకు 30 పడకల ఆస్పత్రిగా మార్చలేదు. రెండో వైద్యాధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు.

నియోజకవర్గ కేంద్రంలో తప్ప మిగతా మండలాల్లో డిగ్రీ కాలేజీ లేదు. దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. స్థానిక జూనియర్‌ కళాశాలలో డిగ్రీ కాలేజీకి సరిపడా స్థలం ఉందని, అక్కడ డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు సూచన చేసినా పట్టించుకోలేదు. పోనీ కనీసం రైతులకు పంట నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేసినా కనీసం స్పందించలేదంటే టీడీపీ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


నేను గెలిచిన వెంటనే నిర్మాణాలు చేపడతాం అన్న హామీ ఎక్కడుందో..
టీడీపీ చీపురుపల్లి ఎమ్మేల్యే  అభ్యర్థిగా 2014లో కిమిడి మృణాళిని పోటీచేశారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మొదటిగా ఆనందపురం, నడుపూరు రోడ్డును బీటీ రోడ్డు చేస్తామని ఆయా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, రాష్ట్ర మంత్రిగా కూడ పనిచేశారు. కాని ఆ ఇరుగ్రామాలకు మధ్య బీటీ రోడ్డు నిర్మించలేకపోయారు. హామీని ఆమలు చేయకపోవడంతో ఇరుగ్రామాల ప్రజలు ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎం ఇచ్చిన హామీ నేరవేర్చాలి
గుర్ల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చుతానని గుజ్జింగవలసలో సీఎం పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు ఏళ్లు గడుస్తున్నా వాటి అమలుకు మాత్రం నోచుకోలేదు. గుర్ల పీహెచ్‌సీలో రోగులు తాకిడి అధికంగా ఉన్నప్పుడు వారికి సెలైన్‌ ఎక్కిం చాలంటే ఆరుబయట లేదా బెంచీలపై ఉంచి ఎక్కిస్తున్నారు.              
– రోగాన అప్పలనాయుడు, గుర్ల 


డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలి
సీఎం హామీ మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, అగ్రికల్చర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని ఎంతో సంబరంపడ్డాం. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రైవేట్‌ కాలేజ్‌ల్లో ఫీజులు భారం మోయలేక విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు.                  
– సారిక దివాకర్, గుర్ల 


పరికరాలు  మరిచిపోయారు
గుజ్జింగివలస గ్రామంలో సీఎం పర్యటనలో భాగంగా గ్రామంలోని యువకుల కోసం జిమ్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నాలు గేళ్లు తరువాత భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఆ భవనాల్లో వ్యాయామ పరికరాలను అమర్చలేదు. భవనాలు ఉన్నప్పటికీ అవి మంజూరు కాలేదు. సీఎం హామీలకే దిక్కులేకపోతే ఎమ్మెల్యే హామీలకు దిక్కెవరు.
– అట్టాడ అప్పలరాజు, గుజ్జింగివలస, గుర్ల 


హామీలు అమలుచేయడంలో విఫలం
నడుపూరు, ఆనందపురం మధ్య రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణాలు చేపడతామని ఎమ్మెల్యే మృణాళిని ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీటీ రోడ్డు నిర్మాణంపై పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్లు కోసం హామీలివ్వడం, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వాటిని మరిచిపోవడం ఆనవాయితీగా వస్తుంది.
– నడుపూరు అప్పలనాయుడు, ఆనందపురం 

మరిన్ని వార్తలు