పోలవరానికి శాపంగా బాబు పాలన

20 Jun, 2019 11:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని అయిన పోలవరం ఎంతటి నిర్లక్ష్యానికి గుర్యయిందో అందరికీ తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో పోలవరాన్ని డబ్బులిచ్చే ఏటీఎమ్‌గానే చూసిన టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఐదేళ్ల కాలంలో ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది.

పేరు కోసం బాబు ఆరాటం..
ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన స్వాతంత్య్రం రాక ముందు నుంచే అంటే 1941 నుంచే ఉంది. 2004 వరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులూ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను సాధిస్తే నిధులకు ఇబ్బంది ఉండదని భావించిన మహానేత వైఎస్‌.. ఆ దిశగా అడుగు ముందుకేశారు. అయితే చంద్రబాబు మాత్రం పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత తనదేనని, తాను పోలవరాన్ని కట్టి చూపిస్తానని ప్రకటనలతో హోరెత్తించారు. కనీసం పునాదులు కూడా పూర్తి చేయలేని బాబు అసమర్థ పాలనను ప్రజలు తరిమికొట్టడం అందరం చూశాం. 

ప్రచారంపై ఉన్న శ్రద్ద.. పనులపై పెట్టలేదు
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మట్టి పనులు 1,169.56 లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాలి. ఇప్పటివరకూ 1,012.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. ఇంకా 156.91 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో 38.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలి. ఇప్పటివరకూ 30.28 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేశారు. ఇంకా 8.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉంది. ఇలా పరిగణనలోకి తీసుకుంటూపోలే పావలా భాగం పనులు కూడా పూర్తి కాలేదని స్పష్టమవుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్‌ మాత్రం 66.74% పూర్తి చేసినట్లు గొప్పగా ప్రకటించుకోవడం గమనార్హం.

చదవండి : చంద్రబాబు చేసింది గోరంత.. చెప్పుకున్నది కొండంత 

>
మరిన్ని వార్తలు