ఆశలు హుష్‌'ఖాకీ!'

20 Nov, 2018 08:19 IST|Sakshi

పోలీస్‌ కొలువుల్లో జిల్లాకు అన్యాయం

సివిల్‌ ఎస్సై పోస్టులకు తీవ్ర పోటీ అభ్యర్థుల ఆవేదన

పశ్చిమగోదావరి, భీమవరం టౌన్‌: ‘పశ్చిమగోదావరి జిల్లాకు రుణపడి ఉంటాను. ఇక్కడ ప్రజల  మేలు  ఎన్నటికీ మర్చిపోను.’ ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇవే మాటలు చెబుతారు. గత ఎన్నికల్లో అన్ని స్థానాలూ టీడీపీకి కట్టబెట్టిన జిల్లాలో నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే పోస్టుల భర్తీలో మాత్రం అన్యాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా  పోలీస్‌ కొలువుల్లోనూ తీవ్ర అన్యాయం చేసి  మరోసారి జిల్లావాసులను మోసం చేశారు. రెండేళ్లుగా పోలీస్‌ కొలువు కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు.  ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ అభ్యర్థులకు శరాఘాతంలా తగిలింది. సివిల్‌ కానిస్టేబుల్‌ కొలువుల్లో జిల్లాకు రిక్త హస్తం చూపారు. ఎస్సై, ఇతర పోస్టులూ స్వల్పంగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. పోలీస్‌ శాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మిస్తూ వచ్చింది. 12,234 పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 3,057 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు నిల్‌     
సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 1600 భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా అన్ని జిల్లాలకు ఎన్నో కొన్ని పోస్టులు కేటాయించినా పశ్చిమ గోదావరికి మాత్రం శూన్యహస్తం చూపారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 300 భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా జిల్లాకు ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో 400 ఫైర్‌మెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా జిల్లాకు కంటితుడుపుగా 25 పోస్టులు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో అగ్నిమాపక శాఖలో 70 మందికిపైగా సిబ్బంది కొరత ఉంది. సివిల్, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు కేటాయించక పోవడంతో ఫైర్‌మెన్‌ 25 పోస్టులకు పోటీ ఎక్కువకానుంది. దీంతోపాటు అతి స్వల్పంగా కేటాయించిన సివిల్‌ ఎస్సై పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంటుంది.ఇక ఏఆర్‌ కానిస్టేబుల్‌ 300, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ 300, మేల్‌ వార్డెన్‌ 100, ఫిమేల్‌ వార్డెన్‌ 23, ఫైర్‌మెన్‌ 400 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

లక్షలాది మంది పోటీ
ఎస్సై ఇతర పోస్టులు రాష్ట్రంలో తక్కువ భర్తీ చేయనుండడంతో ఇప్పటికే సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎదురుచూస్తున్న పీజీ ఆ స్థాయి అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 334 పోస్టులకుగాను లక్షలాది మంది పోటీ పడే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కంటితుడుపు చర్యగా పోస్టులు భర్తీ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

భీమవరానికి చెందిన ఎం.వెంకటేశ్వరావు పోలీస్‌ కానిస్టేబుల్‌ కావాలని ఏడాది కాలంగా దేహధారుడ్యం, పరుగు, లాంగ్‌ జంప్, హైజంప్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్‌లో సివిల్‌ కానిస్టేబల్‌ పోస్టు జిల్లాకు లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇప్పుడు కేవలం 150 పోస్టులు మాత్రమే ఉన్న సివిల్‌ ఎస్సైకు దరఖాస్తు చేసి ఉద్యోగం దక్కించుకోవాలని శ్రమిస్తున్నాడు.

ఉండికి చెందిన జి.శరత్‌కుమార్‌ ఇంటర్‌ చదువుకున్నాడు.  సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం పొందాలని ఎప్పటి నుంచో కలగంటున్నాడు. 2016 తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్‌ విడుదలైనా  జిల్లాకు పోస్టులు కేటాయించక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.

మరిన్ని వార్తలు