‘హెచ్’ బ్లాక్‌కు బాబు ఓకే

23 May, 2014 02:47 IST|Sakshi
‘హెచ్’ బ్లాక్‌కు బాబు ఓకే

* సీమాంధ్ర సీఎం కార్యాలయం అదే
* చంద్రబాబును కలిసిన సీఎస్, విభజన కమిటీ సభ్యులు
* రాష్ట్ర విభజన ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
* మార్గదర్శకాల ప్రకారమే చర్యలని వివరణ
* క్యాంపు కార్యాలయంగా లేక్‌వ్యూ వద్దన్న చంద్రబాబు
* సీమాంధ్రలో క్యాంపు కార్యాలయం కావాలన్న టీడీపీ అధినేత
* ఉద్యోగుల విభజన పొరపాట్లు లేకుండా చేయాలని సూచన

 
 సాక్షి, హైదరాబాద్:
సీమాంధ్ర ముఖ్యమంత్రిగా సచివాలయంలోని సౌత్ ‘హెచ్’ బ్లాక్‌లో కొనసాగడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుని ఉంటారని, అక్కడ కొనసాగడానికి తనకేమీ ఇబ్బంది లేదని, తమ మనుషులు వచ్చి పరిశీలిస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న తీరును, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, విభజన కమిటీలకు నేతృత్వం వహిస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు గురువారం ఆయనకు వివరించారు.
 
 విభజనకు జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగానే తాము ముందుకు సాగుతున్నట్లు మహంతి చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారికంగా నియమితులైన కమిటీ సభ్యులు, సీఎస్ నేతృత్వంలో విభజన పై వాస్తవ పరిస్థితులను కేసీఆర్, చంద్రబాబులకు వివరించాలని భావించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించిన భవనంలోని సివిల్ పనులన్నీ జూన్ రెండో తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణం త్వరగా జరగాలన ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 అలాగే సీమాంధ్రలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా సూచించారని అధికారవర్గాలు వివరించాయి. అయితే అది ఎక్కడన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదని ఓ అధికారి తెలిపారు. క్యాంపు కార్యాలయంగా లేక్‌వ్యూ అతిథి గృహం అవసరం లేదని, తన ఇంటి నుంచే క్యాంపు కార్యాలయం కొనసాగిస్తానన్నారని చెప్పారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి పొరపాట్లు లేకుండా చేయాలని, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకుండా పారదర్శకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగుల విభజన జరగలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అతిథి గృహాలను ఇరు రాష్ట్రాలకు జనాభా దామాషా పద్ధతిలో గదులు కేటాయిస్తామని ఆ అధికారి తెలిపారు. మంత్రులకు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్లు 30 మాత్రమే ఉన్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు