అప్పుడూ.. ఇప్పుడూ సేమ్‌ టు సేమ్‌!

9 Mar, 2019 07:30 IST|Sakshi

ఓటుకు కోట్లు తరహాలో డేటా స్కాంను  పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు స్కెచ్‌

పోలీసులతో పోటీ రాజకీయం..

తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై కేసులు

రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించే యత్నం

అప్పుడు మత్తయ్య.. ఇప్పుడు అశోక్‌కు ఆశ్రయం?

సాక్షి, అమరావతి : తీవ్ర సంచలనం సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటా స్కాం బాగోతంలో సీఎం చంద్రబాబునాయుడు.. నాడు ఓటుకు కోట్లు కేసులో వ్యవహరించినట్లుగానే నేడు కూడా అచ్చు అలాగే అడుగులేస్తున్నారు. అప్పట్లో పోలీసులతో పోటీ రాజకీయం నడపినట్లుగా ఇప్పుడు కూడా డేటా స్కాంలోనూ అలాగే చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. టీడీపీ సేవామిత్ర యాప్‌ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. కోట్లాది మంది పౌరుల రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని సీనియర్‌ పోలీసు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?)

తప్పించుకునేందుకే ‘సిట్‌’ ఏర్పాటు
ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే మళ్లీ దీనిపై కూడా ‘సిట్‌’ ఏర్పాటుచేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 2015లో వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పన్నిన ఎత్తుగడనే ప్రస్తుత డేటా స్కాం విషయంలోనూ అవలంబిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కితే ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. ఏపీలో అతనికి షెల్టర్‌ ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు కేసులు పెట్టించి ‘సిట్‌’ ఏర్పాటుచేశారు. అదే సమయంలో చంద్రబాబు తన మకాన్ని హుటాహుటిన విజయవాడకు మార్చారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ‘బ్రీఫ్డ్‌ మీ..’ వాయిస్‌ ఆయనదిగానే నిర్ధారణ అయింది. (‘ఐటీ గ్రిడ్స్‌’కు సిట్‌ తాళం)

మత్తయ్య తరహాలోనే అశోక్‌కు ఆశ్రయం?
ఇదిలా ఉంటే.. టీడీపీ సేవామిత్ర యాప్‌ ద్వారా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటా స్కాంకు పాల్పడిందని బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఈ బాగోతంలోనూ ఆయన పోలీసులను ప్రయోగించి విమర్శలపాలయ్యారు. డేటా స్కాం బయటపడిన రాత్రికిరాత్రి ఏపీ పోలీసులను హైదరాబాద్‌ పంపి హడావుడి చేయించడం చేతులు కాల్చుకున్నట్లయ్యింది. మరోవైపు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఐటీ గ్రిడ్స్‌ అధినేత దాకారపు అశోక్‌కు కూడా గతంలో మత్తయ్యకు మాదిరిగానే ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అశోక్‌ తెలంగాణ పోలీసులకు చిక్కితే రాజకీయంగా చంద్రబాబు, లోకేశ్‌లు ఇబ్బందులు తప్పవనే భయంతో అతన్ని ఏపీ పోలీసుల కస్టడీలో రహస్య ప్రాంతంలో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది.

అశోక్‌ వద్ద కీలకమైన మూడు హార్డ్‌ డిస్క్‌లు, ఐఫోన్‌ దొరికితే డేటా స్కాం కేసులో గుట్టురట్టవుతుందని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పోలీసుల దర్యాప్తును అడ్డుకునే అవకాశంలేక ఏపీ పోలీసులను రంగంలోకి దించి ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓట్లు తొలగింపులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కూడా తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. 

రెండు సిట్లు ఏర్పాటు..
కాగా, ఐటీ గ్రిడ్స్‌ డేటా స్కాంతో ఇప్పటికే కలవరపడుతున్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్‌ సిట్‌ ఏర్పాటుచేయడంతో ఇక్కడ కూడా హడావుడిగా గురువారం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్‌) ఏర్పాటుచేసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ రాజధానిలో పెట్టిన కేసును విచారించేందుకు ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏడీజీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్‌ను, ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై దర్యాప్తునకు లీగల్‌ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రెండో సిట్‌ను నియమించారు.   

మరిన్ని వార్తలు