నారావారు నోరు మెదపరు

27 May, 2017 20:15 IST|Sakshi
నారావారు నోరు మెదపరు

రాష్ట్రం అన్నీ కోల్పోతున్నా అదే మౌనం
పదో షెడ్యూల్‌ ఆస్తుల్లో వాటా పోతున్నా మాట్లాడని బాబు


కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా మీనమేషాలు
రెవెన్యూలోటు భర్తీకి నిధులడగరు
ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దంటారు
కమీషన్లకోసం పోలవరం మేమే కడతామంటారు
విభజన చట్టంలోని ఏ ఒక్క హామీకోసం గట్టిగా ప్రయత్నించరు
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లరు
ఢిల్లీలో కేంద్రానికి పొగడ్తలు... రాష్ట్రంలో బీద అరుపులు


సాక్షి, అమరావతి
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి హక్కుగా రావాల్సిన అంశాలపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విభజన చట్టంలోని పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు చెందిన రూ.36,835.43  కోట్ల ఆస్తుల పంపిణీ విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ఆయన గట్టిగా ప్రయత్నించకపోవడమే కారణమని అధికార, ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి. జనాభా నిష్పత్తి మేరకు ఈ ఆస్తుల్లో ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉండగా... ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఏపీకి రాకుండా జరిగిన అన్యాయాన్ని కనీసం ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ అంశంపై ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆయనకెంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.

గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లినా, ప్రధానమంత్రిని కలిసినా రాష్ట్రానికి సంబంధించిన నిధులను రాబట్టే విషయంలో గట్టిగా పట్టుబట్టకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఉద్యోగులు, రాష్టŠట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తేవాల్సిన ముఖ్యమంత్రే ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ పలుమార్లు వ్యాఖ్యానించడం, లేని ప్యాకేజీని ఇచ్చినట్లు ప్రచారం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం... రైల్వేజోన్‌ విషయంలో నోరు మెదపకపోవడం, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించలేకపోవడం, విభజన చట్టంలోని పలు హామీలు అమలు కాకపోయినా పట్టించుకోకపోవడం ముఖ్యమంత్రి ఉదాసీనతకు అద్దం పడుతోందని దుయ్యబడుతున్నారు.

రాష్ట్రానికి సంజీవనిలాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇస్తామని చెప్పినా, పట్టుబట్టి మేమే నిర్మిస్తామంటూ తెచ్చుకోవడంతో వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్నో అవమానాలను భరిస్తున్నానంటూ పదే పదే చెప్పే చంద్రబాబు... రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం గత మూడేళ్లుగా ఢిల్లీలో నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు పదవ షెడ్యూలులో గల సంస్థల ఆస్తుల విషయంలోను సీఎం ఇదే ధోరణి అనుసరించడం దారుణమని ఉద్యోగులు వాపోతున్నారు.

ఏపీకి వాటాకోసం ప్రయత్నించని సీఎం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటాకోసం గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా గట్టి ప్రయత్నం చేయకపోవడంతో రూ.36,835.43కోట్ల విలువైన ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ తెలంగాణలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ సంస్థలన్నీ ఏర్పాటైనందున ఆ ఆస్తుల్లో ఏపీకి తప్పకుండా వాటా ఉందని విభజన చట్టంలో పొందుపరిచారు. పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు మొత్తం రూ.36,835.43  కోట్ల విలువగల ఆస్తులున్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో 120 సంస్థలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసినందున ఈ సంస్థల్లో రాష్ట్రానికి జనాభా నిష్పత్తి మేరకు ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌పై పదేళ్ల పాటు హక్కు ఉన్నప్పటికీ ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి దొరికిపోవడంతో అర్ధంతరంగా హక్కులన్నీ వదిలేసుకుని విజయవాడకు వచ్చేశామని, ఇప్పుడు ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నా నోరు మెదపకపోతే ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మౌనంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిధుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని, చివరకు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేదిలేదంటూ మంత్రివర్గంలో చర్చించినట్లు తమ అనుకూల పత్రికల్లో రాయించుకోవడం తప్ప ఆ దిశగా ప్రయత్నాలేమీ జరగడంలేదని విమర్శిస్తున్నారు.

ఎన్నో కోల్పోయాం.. ఇంకా కోల్పోతున్నాం..
విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేకహోదా, రైల్వేజోన్, పోలవరం, ఇతర హామీల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బలమైన ప్రయత్నాలు చేయకపోవడంతో ఇప్పటికే తీరని నష్టం జరిగింది. రాష్ట్రం విడిపోయిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పూర్థి స్థాయిలో రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా ముఖ్యమంత్రి దానిపై మాట్లాడిన దాఖలాలు లేవు. అధికారులు ఆర్థిక లోటు రూ.16,078 కోట్లుగా తేల్చగా.. ఇప్పటివరకు కేవలం రూ.3,979 కోట్లకు మించి సాధించలేకపోయారు. అలాగే విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం భరించబోమని ప్రకటించినా సీఎం మౌనం వహించడాన్ని అధికారులు, మేధావులు తప్పుబడుతున్నారు.

విభజనచట్టంలో పేర్కొన్న దుగరాజపట్టణం ఓడరేవును సాధించలేకపోయారు. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పటివరకూ అడుగు ముందుకు పడలేదు. అధ్యయనానికి మరో కమిటీ ఏర్పాటు చేసినా ఎటువంటి పురోగతీ లేదు. రైల్వే జోన్‌ ఏర్పాటుతోపాటు విభజన చట్టంలోని హామీలకోసం ఇప్పటివరకూ గట్టిగా పోరాడలేదు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.43 వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా డిమాండ్‌ చేయడం లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చుతున్నారని, కేంద్రం నుంచి చట్టం మేరకు రావాల్సిన నిధులను, సంస్థలను, విభజన నష్టాలను రాబట్టలేకపోతున్నారని మేధావులు, అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

తూతూమంత్రంగా ధిక్కార పిటిషన్‌
ఉన్నత విద్యామండలి నిధుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా పదవ షెడ్యూల్‌ సంస్థల ఆస్తులపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందని, ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కారం కిందకు వస్తాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పేర్కొనడం పట్ల అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధానిని కలిసి పట్టుబట్టి సాధించాల్సిన ముఖ్యమంత్రి... తూతూమంత్రంగా కేంద్రమంత్రులను కలవమనడం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఏదో చేస్తున్నామన్న భావన కల్పించడానికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని చెబుతున్నారని విమర్శిస్తున్నారు.

పదవ షెడ్యూల్‌ మేరకు హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమైన సంస్థల్లో కొన్ని
ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ అకాడమీ
డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ
సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ
బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌
ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌
ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ
ఏపీ ఉర్దూ అకాడమీ
హిందీ అకాడమీ
తెలుగు అకాడమీ
సంస్కృత అకాడమీ
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ
ఏపీ వక్ఫ్‌ బోర్డు
ఏపీ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీ
ఏపీ ఉమెన్స్‌ కమిషన్‌
డాక్టర్‌ వైఎస్సార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌

మరిన్ని వార్తలు