చంద్రబాబు గిరిజన ద్రోహి: కుంభా రవిబాబు

18 Dec, 2019 12:12 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టీ కమిషన్‌ బిల్లును అడ్డుకుని గిరిజనుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి, వారి సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్టీ కమిషన్‌ బిల్లు ప్రవేశపెడితే.. శాసన మండలిలో చంద్రబాబు అడ్డుతగిలారని అన్నారు. ఎస్టీ కమిషన్‌ను, ఎస్సీ కమిషన్‌ నుంచి వేరుచేసి గిరిజనులకు మేలు జరుగాలని చూస్తే.. దానిని అడ్డుకున్న చంద్రబాబు చరిత్రలో గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారని, ఎస్టీకి సంబంధించి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్టీకి సంబంధించి అన్ని అసెంబ్లీ స్దానాలు, ఎంపీ స్దానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడంతో.. ఓర్వలేకే ఎస్టీ కమిషన్ బిల్లుకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. 

కేంద్రంలోలానే రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ప్రత్యేకంగా ఉంటే.. ఎస్టీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో గిరిజనులు లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మాత్రమే అని విమర్శించారు. టీడీపీకి గిరిజనులు ఓట్లేయలేదు, ఎందుకు పని చేయాలని అడిగిన వ్యక్తి చంద్రబాబు అని, అరుకు నియోజకవర్గంలో ఆయన దతత్త తీసుకున్న గ్రామాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇక కిడారి శ్రావణ్‌ తండ్రి చనిపోవడం, త్వరలో ఎన్నికలు వస్తుండడంతో .. సానుభూతి ఓట్లు పడుతాయని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. అలానే గిరిజన కార్పోరేషన్‌ ను కూడా  ప్రభుత్వం పడిపోతుందని తెలిసి నెలరోజుల ముందు ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కుంభా మండిపడ్డారు. ఆదివాసిల గుండెల్లో ఎక్కడ జగన్‌ శాశ్వతంగా నిలిచిపోతారోనని చంద్రబాబు నాయుడు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా