‘పోలవరం’ నిర్వాసితులపై కట్టుకథలు

28 Dec, 2018 08:53 IST|Sakshi
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో గిరిజనేతరుల పునరావాసం కోసం సేకరించిన భూములు

కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించిన రాష్ట్ర సర్కారు

గిరిజనేతర నిర్వాసితులు ఇళ్లే కావాలంటున్నారని వెల్లడి

ఎక్కువమంది నిర్వాసితులు కోరింది నగదు పరిహారమే

పునరావాస కాలనీల కోసం అధిక ధరకు భూముల కొనుగోలు

చేతులు మారిన రూ.100 కోట్లు అధికార పార్టీ నేతలు, అధికారుల అక్రమాలు

పశ్చిమగోదావరి, వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కాలనీల నిర్మాణంపై రాష్ట్ర  ప్రభుత్వం కట్టుకథ అల్లింది. నిర్వాసితుల పునరావాసంపై కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరణకు పచ్చి అబద్ధాలను వండి వార్చింది. పునరావాస ప్యాకేజీపై అధికారులు మొదట సర్వే నిర్వహించినప్పుడు గిరిజనేతరులంతా తమకు కాలనీలు వద్దని, పరిహారం నగదు రూపంలోనే చెల్లించాలని కోరారు. గిరిజనులు అయిష్టంగానే కాలనీల నిర్మాణాలకు అంగీకరించారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం కోరిన వివరణలకు రాష్ట్రం పంపిన నివేదికను చూస్తే విస్మయం కలగక మానదు. ముంపునకు గురయ్యే ఇళ్లకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన పరిహారాన్ని అడ్డగోలుగా దోచేస్తున్న అధికార పార్టీ నేతలు, అధికారులు చివరకు కాలనీల నిర్మాణాల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు ఇళ్లు కోల్పోనున్నాయి. ఇందులో 10,000 గిరిజన కుటుంబాలు, 19,545 గిరిజనేతర కుటుంబాలున్నాయి. గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాసం కల్పించనున్నారు. గిరిజనులకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, హౌసింగ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఐడీసీ) తదితర శాఖల ఆధ్వర్యంలో రూ.470 కోట్ల వ్యయంతో ఈ పునరావాస కాలనీల పనులు చేపడుతున్నారు. ఇందులో హౌసింగ్‌ శాఖకు రూ.222 కోట్లు, ఐటీడీఏ ఇంజనీరింగ్‌కు రూ.161 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.41 కోట్లు, మిగతావి ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్‌ఐడీసీలకు కేటాయించారు. వేలేరుపాడు మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల్లోని 48 గ్రామాల్లో 4,800 మంది గిరిజన నిర్వాసితులకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో  ఏడు చోట్ల కాలనీలు నిర్మిస్తున్నారు. దర్భగూడెంలో 980, బుట్టాయగూడెంలో 1,100, రౌతుగూడెంలో 310, దొరమామిడిలో 700, స్వర్ణవారిగూడెంలో 450, ముల్కలంపల్లిలో 950, రాసన్నగూడెంలో 400 ఇళ్లు నిర్మిస్తున్నారు. కుక్కునూరు మండలంలో 15 గ్రామ పంచాయతీల్లోని 59 గ్రామాల్లో 3,048 మంది నిర్వాసితులకు ఇదే మండలంలో ఐదు చోట్ల కాలనీలు నిర్మిస్తున్నారు. ఈ మండలంలోని పెదరావిగూడెం, ఉప్పేరు, కివ్వాక, దాచారం(రాయికుంట), చీరవల్లి తదితర గ్రామాల్లో ఈ కాలనీలు నిర్మిస్తున్నారు.

అలాంటి దరఖాస్తులు రాలేదట!
భూసేకరణ చట్టం–2013లో సెక్షన్‌ 31(1), 38(1), 105(3) ప్రకారం గిరిజనేతర నిర్వాసితులకు ఇళ్లు కట్టివ్వాలనే నిబంధనలు లేవు. నిర్వాసితుడి కోరిక మేరకు నగదు రూపంలో పరిహారం చెల్లించవచ్చు. దీనిపై కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్టోబర్‌ 6న ఢిల్లీలో జరిగిన సమావేశంలో వివరణ కోరింది. ఇళ్లు వద్దని, నగదు రూపంలో పరిహారం ఇవ్వాలని నిర్వాసితుల నుంచి దరఖాస్తులు వచ్చాయా? అని రాష్ట్రాన్ని ప్రశ్నించింది. అలాంటి దరఖాస్తులేవీ రాలేదని రాష్ట్ర సర్కారు సమాధానం ఇచ్చింది. 2016లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొదట ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే చేపట్టారు. 85 శాతం మంది గిరిజనేతరులు నగదు పరిహారమే కావాలని కోరారు. కానీ, ప్రభుత్వం గిరిజనేతరుల ఇళ్ల కోసం భూసేకణ చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది. 

రూ.100 కోట్లు కొట్టేశారు!
వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గిరిజనేతర కుటుంబాల ఇళ్ల కోసం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఎకరం రూ.22.50 లక్షల చొప్పున 1,100 ఎకరాలను రూ.247.50 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో 400 ఎకరాల కొనుగోలుకు పీఎన్‌ (ప్రిలిమినరీ నోటిఫికేషన్‌) జారీ చేశారు. ప్రాజెక్ట్‌ వల్ల భూములు కోల్పోయే నిర్వాసితుడికి ఎకరాకు రూ.10.50 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం పునరావాసం కోసం తీసుకునే భూములకు ఎకరాకు రూ.22.50 లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు ప్రధాన రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఎకరా ధర రూ.14 లక్షలలోపే పలుకుతోంది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ నేతలు, అధికారులు పాలుపంచుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదేశాల మేరకేభూములు సేకరించాం
‘‘జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 1,100 ఎకరాలు సేకరించాం. ఇంకా 400 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ చట్టం–2013 లో గిరిజనేతరులకు ఇళ్లకు బదులు పరిహారం ఇవ్వకూడదనే నిబంధనలేమీ లేవు. ఇల్లుకు బదులు ఇల్లు ఇవ్వాలని కూడా లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే భూములు కొనుగోలు చేశాం’’  – హరీంధర ప్రసాద్‌ ఐటీడీఏ పీఓ, భూసేకరణాధికారి

నిర్వాసితుడు కోరితేనగదు పరిహారం ఇవ్వాలి
‘‘భూసేకరణ చట్టం–2013 ప్రకారం.. నిర్వాతుడు కోరితే నగదు పరిహారం ఇవ్వాలి. వారు కోరుకున్న విధంగా పునరావాసం కల్పించాలి. ఇంట్లో ఒక ఉద్యోగం తప్పకుండా ఇవ్వాలని చట్టంలో ఉంది. ఉపాధి కల్పించాలి. కులం అనే తారతమ్యం లేకుండా భూమిలేని ప్రతి నిర్వాసితుడికి ప్రాజెక్ట్‌ ఆయకట్టులో భూములివ్వాలి. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలి’’
– డాక్టర్‌ పెంటపాటి పుల్లారావు,ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త

మరిన్ని వార్తలు