రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!

14 Feb, 2020 09:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడిన క్రమంలో.. గురువారమే హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్‌ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న రాత్రి నుంచి న్యాయవాదులు, తన ఆడిటర్లతో బాబు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ సోదాల నేపథ్యంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఐటీ శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా గురువారం విడుదల చేసిన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌), బోగస్‌ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.(చంద్రబాబు అవినీతి: మచ్చుకు రూ.2,000 కోట్లు)

ఈ క్రమంలో ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో పలు కీలక డైరీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతీ చిన్న విషయానికి రాద్దాంతం చేసే చంద్రబాబు... ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగినా నోరు మెదపకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ తన చిట్టా విప్పేసారేమోనన్న గుబులుతో శనివారం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన చంద్రబాబు.. రెండురోజుల ముందుగానే అక్కడికి బయల్దేరారనే ప్రచారం సాగుతోంది. కాగా ఐటీ రాడార్‌కు చిక్కిన ‘‘తెలుగు దొంగల అవినీతి కుంభకోణం’’పై జనం నోరెళ్లబెడుతున్నారు. పీఎస్‌ల స్థాయిలోనే రెండువేల కోట్ల అక్రమార్జన బయటపడితే అసలు పెద్దలు ఎంత నొక్కేసి ఉంటారో అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఐటీ దాడుల్లో పట్టుబడ్డ ఇన్‌ఫ్రా కంపెనీల డైరెక్టర్ల జాబితా తీస్తే పెద్దచేపల బండారం బయటపడుతుందంటూ చర్చించుకుంటున్నారు. (లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది)

2 వేల కోట్ల నల్లధనం : టీడీపీ నేతల్లో గుబులు

మరిన్ని వార్తలు