సీఎం సభ కోసం డ్వాక్రా మహిళలపై ఒత్తిడి

26 Dec, 2018 11:35 IST|Sakshi
డ్వాక్రా మహిళలు

సమస్యలపై హామీలు ఇస్తున్న అధికారులు

5వ తేదీ నుంచి సమ్మెలో ఉన్న వెలుగు సిబ్బంది

విద్యార్థులను తరలించాలని యాజమాన్యాలకు ఆదేశాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమం కోసం ఈనెల 27న సీఎం చంద్రబాబు నాయుడు మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు అవస్థలు పడుతున్నారు. డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి సోమవారం ఆయా మండలాలకు సంబంధించి ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లోని డ్వాక్రా సంఘాలకు సంబంధించిన గ్రామ సమాఖ్య సహాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల అధికారులు కూడా సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సభకు 15వేల మంది డ్వాక్రా మహిళలను తరలించాల్సి ఉందని సూచించారు. ప్రధానంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆగమేఘాలపై సమస్యల పరిష్కారం కోసం హామీ
ఈనెల 5వ తేదీ నుంచి వెలుగు సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. మండలాల్లో పనిచేస్తున్న ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌సీసీలు సమ్మె చేస్తుండటంతో డ్వాక్రా మహిళల సమస్యలను పరిష్కరించే వారు కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 33,259 డ్వాక్రా సంఘాల పరిధిలో 3,20,720 మంది సభ్యులు ఉన్నారు. చాలా మండలాల్లో వీరి సమ్మె నాటి నుంచి బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయలేదు. తొలి నుంచి డ్వాక్రా మహిళల రుణ పత్రాలపై సీసీలు గ్యారెంటీ కింద సంతకాలు చేసేవారు. వారు సంతకాలు చేయకపోవడంతో రుణాలు ఆగిపోయాయి. మొత్తం 18 రకాల విధులు ఆగిపోయాయి. చంద్రన్న పెళ్లికానుక పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయాల్సిన ఏపీఎంలు సమ్మెలో ఉండటంతో దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా డ్వాక్రా సంఘాలు సమ్మె ప్రభావం కారణంగా పసుపు, కుంకుమ కింద మంజూరు చేసిన డబ్బు వారి ఖాతాల్లో జమ కాలేదు.

ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజులైనా వెలుగు సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మండలాలకు వెళ్లి గ్రామ సమాఖ్య సహాయకులతో చర్చిస్తున్నారు. వెలుగు సిబ్బంది స్థానంలో డీఆర్‌డీఏ అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. స్వయంగా డీఆర్‌డీఏ పీడీ డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్నారు. వెంటనే బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే గ్రామ సమాఖ్య సహాయకులతో డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి సోమవారం సాయంత్రం స్వయంగా సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏపీఎంలతో మాత్రమే పీడీ సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించేవారు.

మళ్లీ విద్యార్థులను పంపాలా..
యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈనెల 4న నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సుకు జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి విద్యార్థులను తరలించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతి బస్సుకు ఒక వీఆర్‌ఓ చొప్పున నియమించి పర్యవేక్షణకు ఆర్‌ఐలను ఏర్పాటు చేశారు. ఇందు కోసం అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు రెవెన్యూ అధికారులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలతోపాటు విద్యార్థులను తరలించేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరు ప్రాంతంలోని 12 విద్యా సంస్థలకు సంబంధించి బస్సుకు 50 మంది చొప్పున విద్యార్థులను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జ్ఞానభేరి తరహాలోనే వీఆర్‌ఓలకు బాధ్యతలు అప్పగించారు. మొన్నే కదా విద్యార్థులను పంపించింది. మళ్లీ విద్యార్థులంటే ఎలా? పరీక్షల సమయం ఆసన్నమవుతోందని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ప్రభుత్వ ఆదేశాలు, పాటించక తప్పదని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు