పోలవరంలో చంద్రబాబు పోజులు

24 Dec, 2018 11:10 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో షోకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సోమవారం  ప్రాజెక్టు స్విల్‌ వే ప్రాంతానికి చేరుకుని 41వ గేటు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి 43 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇంత హడావిడి చేసి కేవలం ఒకే ఒక్క గేటు బిగింపు ప్రక్రియ మాత్రమే ప్రారంభించారు. ఒక్క గేటు అమరికతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసినట్లు చంద్రబాబు నానా హంగామా చేశారు.

గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రాజెక్టు నుంచి నీరివ్వడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయకుండా, గేట్ల అమరిక పూర్తి కాకుండా వచ్చే ఏడాదిలోపు నీరు ఎలా ఇస్తారంటూ ఇంజనీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాథమిక స్థాయి పనులు కూడా పూర్తి చేయకుండానే రాబోయే అయిదు నెలల్లో నీరు విడుదల చేస్తామంటూ చంద్రబాబు చేసే ప్రచారంపై విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్యాలరీ వాక్‌ పేరుతో కుటంబ సభ్యులతో కలిసి పోటోలకు పోజులిచ్చిన చంద్రబాబు.. తాజాగా గేట్ల అమరిక పేరుతో మరోసారి మభ్యపెట్టేప్రయత్నం చేశారు.

గతంలోనే అనేక సార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో హడావిడి చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు లెక్కల ప్రకారం ఇప్పటివరకు ప్రాజెక్టు కేవలం 60శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. భూసేకరణ, డిజైన్ల అనుమతి మంజూరు కాకుండా మిగిలిన పనులను ఎలా పూర్తి చేస్తారంటూ నీటిపారుదల శాఖ నిపునులు ప్రశ్నింస్తున్నారు.

మరిన్ని వార్తలు