ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌

28 Jul, 2018 11:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫైర్‌ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అధికారుల్ని అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పాత నేతల్ని కలుపుకోకుండా పనిచేయడం వంటి ఘటనలపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గురువారం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్, తహసీల్దార్‌పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో రాస్కెల్‌ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో ఉంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. పద్ధతి మార్చుకోండి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న తరుణంలో వాటిని సరిదిద్దుకోకుండా కొత్త వివాదాలు తీసుకు వచ్చి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపైనా సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

జెడ్పీటీసీ సభ్యుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి, పోలంరెడ్డికి మధ్య వివాదం నెలకొని ఉంది.  కోవూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరిపాకన పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి చేజర్ల వర్గానికి చెందిన బూత్‌ కమిటీ కన్వీనర్లను తొలగించి ఆయన సొంత మనుషులను నియమించుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమానికి పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీనిపై చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సీఎంతో  పాటు పార్టీ ముఖ్యులు అందరికీ ఫిర్యాదు చేశారు. దీంతో బూత్‌ కమిటీలు అన్నింటిని రద్దు చేశారు. ఎమ్మెల్యే వ్యవహర శైలి సీఎం వద్ద చర్చ సాగిన క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీరు మార్చుకుని అందర్నీ కచ్చితంగా కలుపుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

ఆత్మకూరు రగడపై సీఎంకు నారాయణ ఫిర్యాదు మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గ రగడపై మంత్రి పి. నారాయణ సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆత్మకూరు తాత్కాలిక ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని పార్టీ నేతలు చర్చించుకుని సీఎం ఆమోద ముద్రతో ప్రకటించారు. మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అక్కడి స్థానిక నేత కన్నబాబు వీటితో నిమిత్తం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మద్దతుగా ఉన్నారు. కొందరు నేతలు ఆత్మకూరులో పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నారని నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు