‘బాబు’ బినామీల చెర నుంచి విముక్తి

23 Jan, 2014 03:44 IST|Sakshi
‘బాబు’ బినామీల చెర నుంచి విముక్తి

బాలాయపల్లి, న్యూస్‌లైన్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ఇండలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి బినామీలు ఆక్రమించిన పేదల భూములకు మోక్షం కలిగింది. తొమ్మిదేళ్ల కిందట పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇప్పటిదాకా భూములు చూపకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం లబ్ధిదారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వీరి ఆందోళనను ‘బాబు భూబాగోతం’ శీర్షికన బుధవారం సాక్షి ప్రముఖంగా ప్రచురించింది.
 
 దీంతో కలెక్టర్ శ్రీకాంత్ ఆదేశం మేరకు గూడూరు ఆర్‌డీవో మధుసూదనరావు, తహశీల్దార్ పూర్ణచంద్రరావు, ఆర్‌ఐ మురళీకృష్ణ, వీఅర్లో చెంచయ్య బుధవారం ఆ భూముల్లో సర్వే నిర్వహించారు. గిరిజనుల భూములు ఆక్రమణకు గురైన విషయాన్ని నిర్ధారించారు. 2004లో డీకేటీ పట్టాలు జారీ చేసిన 18 మందిలో (మేకల రమణయ్య ఊరొదిలి వెళ్లిపోగా, తిరుమల శెట్టి శంకరమ్మ చనిపోయారు, మరో ఇద్దరు అందుబాటులో లేరు.) మిగిలిన 14 మందికి ఒక్కొక్కరికి 77 సెంట్ల చొప్పున 13.88 ఎకరాల భూమిని స్వాధీనం చేశారు. అందుబాటులో లేని వారిద్దరికీ వారంలోపు భూములు చూపిస్తామని తెలిపారు. భూమి స్వాధీనం చేసినా తమకు దారిచూపలేదని గిరిజనులు ప్రశ్నించడంతో, ముందు భూమిని స్వాధీనం చేసుకోవాలని త్వరలోనే పట్టాదారులతో మాట్లాడి దారి ఏర్పాటుచేస్తామని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పట్టాదారులు తమ భూములకు హద్దులు ఏర్పాటుచేసుకుని సాగు చేసుకోవాలని చెప్పారు. సర్వే నంబరు 139లో ఉన్న అసైన్డ్ భూమిలో 13.88 సెంట్ల భూమిని ఎస్సీ, ఎస్టీలకు స్వాధీనం చేశామని, వాటిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు