మీ వల్లే పార్టీ మునిగింది

27 Nov, 2019 08:03 IST|Sakshi
కమలాపురం సమీక్షలో చంద్రబాబుపై విమర్శలకు దిగిన మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయినాథశర్మ

చంద్రబాబుపై కార్యకర్తల ధ్వజం

బహిరంగ  విమర్శలపై బాబు అసహనం

గరం గరంగా రెండోరోజు టీడీపీ సమీక్ష

సాక్షి, కడప: జిల్లాలో పార్టీ నిలువునా మునగడానికి మీరే కారణం. ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ లాంటి వారిని నెత్తికెక్కించుకుని మిగిలిన నేతలు, కార్యకర్తలను పట్టించుకోలేదు, అధికారం ఉన్నప్పుడు మాగోడు వినిపించుకోలేదంటూ పలువురు నేతలు, కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. కడప పర్యటనలో రెండవరోజు మంగళవారం స్థానిక  శ్రీనివాస కళ్యాణ మండపంలో జిరిగిన కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల. మైదుకూరు నియోజకవర్గాల  సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

కమలాపురం,జమ్మలమడుగుకు చెందిన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పై నేరుగా విమర్శలకు దిగినట్లు తెలిసింది.  కమలాపురం మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయినాథశర్మ చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు వారించినా వినలేదు.  ‘ఇప్పుడైనా చెప్పేది  వినండి సార్‌’ అంటూ కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పారు.  బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను కలుపుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినా గుర్తింపు ఇవ్వలేదని ధ్వజమెత్తినట్లు సమాచారం.

ఎప్పుడైనా సమీక్షించారా
జమ్మలమడుగు సమీక్షా సమావేశంలో కూడా కార్యకర్తలు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఉన్నా పార్టీ సభ్యత్వం జరగలేదని, ఎందుకు జరగలేదని దీనిపై ఎప్పుడైనా సమీక్షించారా? అని సుమంత్‌ అనే ఓ కార్యకర్త చంద్రబాబును నిలదీశారు.  కార్యకర్తలను కూడా పార్టీ ఏనాడూ పట్టించులేదని, దానివల్లే టీడీపీకి ఈ పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. జమ్మలమడుగులో పార్టీ భ్రష్టు పట్టేందుకు డబుల్‌ రాజకీయాలకు మీరు అవకాశం కల్పించారని, దీంతోనే పార్టీ నష్టపోయిందని నాగేశ్వరరావు అనే కార్యకర్త చంద్రబాబుపై విమర్శ చేశారు. వ్యాపారస్తుడైన సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపారని, తర్వాత ఆయన వల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని విమర్శించారు.

ఆయనను మీరు ఎలా నమ్మారంటూ బాబును ప్రశ్నించారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అవమానాలు పడ్డామని జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన పలువురు వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, దానివల్లే పార్టీ నష్టపోయిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని జమ్మలమడుగుకు చెందిన కొందరు ఎస్సీ  కార్యకర్తలు ప్రశ్నించారు. ఒక దశలో సహనం కోల్పోయిన చంద్రబాబు కార్యకర్తలపై సీరియస్‌ అయ్యారు. మిగిలిన నియోజకవర్గాల సమీక్షల్లోనూ పార్టీ అధినేతపై విమర్శల దాడి జరిగినట్లు భోగట్టా. 

మరిన్ని వార్తలు