నిర్వాసితులకు చంద్ర‘శాపం’

14 Jul, 2020 05:59 IST|Sakshi

పోలవరం పనుల్లో కమీషన్లు వచ్చే వాటికే అప్పట్లో ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు

నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే కాఫర్‌ డ్యామ్‌లు ప్రారంభం

వాటిని పూర్తిచేయలేక చేతులెత్తేసిన దుస్థితి

వరద ప్రవాహానికి ఎగువన అడ్డంకిగా మారిన కాఫర్‌ డ్యామ్‌ 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశంతో రూ.3,383.31 కోట్లతో పునరావాస పనుల వేగవంతం 

రేపటి నుంచి ఆగస్టు 15లోగా దశల వారీగా 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్‌ కమీషన్ల కక్కుర్తి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శాపంగా మారింది. గోదావరి నది వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే పనులను పూర్తిచేయకుండానే.. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఎన్నికలకు ముందు కాఫర్‌ డ్యామ్‌ల పనులను ప్రారంభించింది. వాటిని పూర్తిచేయలేక చేతులెత్తేసింది. దీంతో నదీ ప్రవాహానికి ఎగువన కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో వరద వెనక్కి ఎగదన్ని ముంపు గ్రామాలను ముంచెత్తింది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ గతేడాది అధికారులను ఆదేశించారు. దీంతో గోదావరిలో వరద ఉధృతమయ్యేలోగా 41.15మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. ఈ పనుల కోసం రూ.3,383.31 కోట్లను ఖర్చుచేస్తున్నారు. ఆగస్టు 15లోగా 17,760 నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించి.. ముంపు బారిన పడకుండా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దీన్నేమంటారు బాబూ?
సాధారణంగా నదీ ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తిచేశాకే ప్రధాన జలాశయం పనులు ప్రారంభించాలి. ఈ పనులు పూర్తయ్యేలోగా.. నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలిస్తారు. ఆ తర్వాత జలాశయంలో నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే సాగునీటి ప్రాజెక్టులను ఇదే రీతిలో నిర్మిస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యమిచ్చారు.
► 2019లో అధికారంలోకి వచ్చి సీఎం అయిన వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిసారించారు.

చిత్తశుద్ధి అంటే ఇదీ..
► టీడీపీ సర్కార్‌ ప్రణాళిక లోపంవల్ల గతేడాది 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపు గ్రామాలతోపాటు దేవీపట్నం మండలంలో ఆరు గ్రామాల ప్రజలు వరద బారినపడ్డారు. ఈ ఏడాది ఆ దుస్థితి పునరావృతం కాకుండా చేసేందుకు ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ పునరావాసంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
► వరదల్లో విద్యుత్‌ స్తంభాలు మునిగిపోకుండా వాటి ఎత్తును 11.5 మీటర్లకు పెంచి.. విద్యుత్‌ అంతరాయాల్లేకుండా కొత్తగా లైన్లు పూర్తిచేశారు. 
► అలాగే, ఈనెల 15 నుంచి దశల వారీగా ముంపు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి, ఆగస్టు 15లోగా 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా