సింగిల్‌ టెండర్ల జాతర జీవోలకు పాతర

8 Oct, 2018 02:29 IST|Sakshi

రూ.944.29 కోట్ల విలువైన పనులను అస్మదీయులకే అప్పగించండి

కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌పై  చంద్రబాబు ఒత్తిడి

సీవీసీ మార్గదర్శకాలు, జీవో 94, 174లను లెక్కచేయని ముఖ్యమంత్రి

సింగిల్‌ టెండర్లను ఆమోదిస్తే ఖజానాపై కోట్లాది రూపాయల భారం

బాబు కమీషన్ల కక్కుర్తి వల్ల టెండర్ల విధానం అపహాస్యం

‘‘కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఏకీకృత నిబంధనలు రూపొందించి టెండర్లు నిర్వహించాలి. అప్పుడే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. అంచనా వ్యయం కంటే తక్కువ ధరలకే పనులు చేసేందుకు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుంది. సింగిల్‌ షెడ్యూలు దాఖలైతే ఆ టెండర్లను రద్దు చేయాలి’’ – టెండర్లపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలు ఇవి.


సాక్షి, అమరావతి: కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. జీవో 94, 174లను వక్రీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. సింగిల్‌ షెడ్యూల్‌ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. రూ.944.29 కోట్ల విలువైన మూడు పనులకు నిర్వహించిన టెండర్లను ఖరారు చేసి..అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని హుకుం జారీ చేశారు. ఈ మూడు పనుల్లో సింగిల్‌ షెడ్యూళ్లపై ఆమోదముద్ర వేస్తే ఖజానాకు భారీగా నష్టం తప్పదు.

మూడు టెండర్లు..
టెండర్లలో ఒకే సంస్థ షెడ్యూల్‌ దాఖలు చేస్తే.. టెక్నికల్‌(సాంకేతిక) బిడ్‌ స్థాయిలోనే వాటిని రద్దు చేసి, కొత్తగా టెండర్లు నిర్వహించాలని జీవో 94, 174లు తేల్చిచెబుతున్నాయి. కానీ, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీలో పెదపూడి రిజర్వాయర్‌ నిర్మాణం, కాలువ తవ్వకం, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల(పిల్ల కాలువ) పనులకు రూ.603.87 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచారు. హెచ్‌ఈఎస్‌(జాయింట్‌ వెంచర్‌) సంస్థ ఒక్కటే 4.57 శాతం ఎక్సెస్‌ కోట్‌ చేస్తూ షెడ్యూల్‌ దాఖలు చేసింది.
కర్నూలు జిల్లాలో పశ్చిమ మండలాలకు నీళ్లందించే ఎత్తిపోతల పథకానికి రూ.177.93 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఇటీవల టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్లలో కోయా ఇన్‌ఫ్రా సంస్థ ఒక్కటే 4.52 శాతం ఎక్సెస్‌ కోట్‌ చేస్తూ షెడ్యూల్‌ దాఖలు చేసింది.
తోటపల్లి పాత రెగ్యులేటర్‌ నుంచి నాగావళి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ.162.49 కోట్లతో ఇటీవల సర్కార్‌ టెండర్లు నిర్వహించింది. సాయిలక్ష్మి ఇన్‌ఫ్రా సంస్థ ఒక్కటే 4.29 శాతం అధిక ధరలు కోట్‌ చేస్తూ షెడ్యూల్‌ దాఖలు చేసింది.

నిబంధనల ప్రకారం ఈ మూడు టెండర్లను టెక్నికల్‌ బిడ్‌ స్థాయిలోనే రద్దు చేయాలి. పైనాన్స్‌(ఆర్థిక) బిడ్‌ తెరవకూడదు. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయా ప్రాజెక్టుల అధికారులు వాటి ఫైనాన్స్‌ బిడ్‌ సైతం తెరిచి, ఆ సంస్థలకే పనులు అప్పగించేందుకు అనుమతి కోరుతూ సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. ఈ టెండర్లను రద్దు చేసి.. మళ్లీ పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే కనీసం 5 శాతం తక్కువ ధరలకే పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు కోట్లాది రూపాయల సొమ్ము ఆదా అవుతుంది. కానీ, ముఖ్యనేత మాత్రం తన ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నారు. ఖజానాకు నష్టం వాటిల్లినా సరే తన జేబులు నిండితే చాలనుకుంటున్నారు.

ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి
సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. ఆయా పనులు వారికే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. సగటున 4.95 శాతం అదనపు ధరలకు(ఎక్సెస్‌) వారికే పనులు కట్టబెట్టి భారీ ఎత్తున కమీషన్లు దండుకోవడం ‘ముఖ్య’నేతకు పరిపాటిగా మారింది. కమీషన్లకు కక్కుర్తి పడి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించడంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల మేరకు 2003 జూలై 1న ప్రభుత్వం జీవో 94ను జారీ చేసింది.

ఆ జీవో మేరకే టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలి. ఇంజనీరింగ్‌–ప్రొక్యూర్‌మెంట్‌–కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానంలో నిర్వహించే టెండర్లను ఖరారు చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ(హెచ్‌పీసీ)కి ప్రభుత్వం కట్టబెట్టింది. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అదనపు ధరలకు షెడ్యూళ్లను కోట్‌ చేస్తే వాటిని హెచ్‌పీసీ గుర్తించి, చర్య తీసుకుంటుంది. కానీ, గత నాలుగేళ్లుగా జీవో 94ను టీడీపీ సర్కార్‌ లెక్కచేయడం లేదు. పైగా మంత్రివర్గ ఉపసంఘాన్ని సంప్రదించకుండానే గతేడాది నవంబర్‌ 16న హెచ్‌పీసీని రద్దు చేస్తూ ముఖ్యనేత ఉత్తర్వులు జారీ చేయించారు.

కాంట్రాక్టర్‌ మనోడైతే చాలు
అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఒకలా.. దక్కే అవకాశం లేనప్పుడు మరోలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తుండడం చూసి జలవనరుల శాఖ అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి అప్పర్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించే పథకానికి రూ.565.28 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది.

చంద్రబాబుకు బాగా కావాల్సిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ ఒక్కటే 4.65 శాతం ఎక్సెస్‌ కోట్‌ చేస్తూ షెడ్యూల్‌ దాఖలు చేసింది. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే ఆ పనులు దక్కడంతో సింగిల్‌ షెడ్యూల్‌ను ఆమోదించేలా సీవోటీపై ఒత్తిడి తెచ్చారు. ఆ సంస్థకు పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్‌లో మిగిలిపోయిన పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చిలో టెండర్‌ నోటిఫికేషన్‌ చేశారు.

ఈ పనులను టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ముందుగానే నిర్ణయించారు. కానీ, ఆ పనులు సీఎం రమేష్‌కు దక్కే అవకాశం లేకపోవడంతో సింగిల్‌ షెడ్యూల్‌ దాఖలైందనే సాకు చూపి.. జీవో 94, 174లను ప్రస్తావిస్తూ ఆ టెండర్లను రద్దు చేయించారు. ఆ పనులకు మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించి.. 4.65 శాతం ఎక్సెస్‌కు సీఎం రమేష్‌ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. 

మరిన్ని వార్తలు