లీక్‌.. చౌకబారు కుట్రే

26 Sep, 2019 05:06 IST|Sakshi

రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని సహించలేక బురద చల్లుడు

ఎల్లో మీడియా, ఓ అధికారి ద్వారా విపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం

పోస్టులకు తగ్గట్టుగా కూడా ఉత్తీర్ణత లేనప్పుడు లీక్‌ ఎలా సాధ్యం?

పశ్నాపత్రం ఇవ్వని వర్సిటీలకు ఇచ్చారంటూ అసత్య కథనాలు

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి ఊపిరిలూదుతూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం.. ఏకంగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా, రాజ్యాంగ పదవిలోని ఓ అధికారి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం జగన్‌ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా చౌకబారు లీకు కుట్రలకు ఎల్లో మీడియా తెర తీసింది.

బురద జల్లే యత్నాలు..
రికార్డు స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దాదాపు 19.50 లక్షల మంది హాజరు కాగా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా రాతపరీక్ష నిర్వహించడంతో ప్రభుత్వ ప్రతిష్ట మరింత ఇనుమడించింది. ఇది ఏ మాత్రం రుచించని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాగైనా సీఎం జగన్‌ ప్రతిష్టను దిగజార్చాల్సిందేనని ఎల్లో మీడియా ద్వారా అసత్య కథనాలకు పథకం  వేశారు. సచివాలయ ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయంటూ ఆధారాలు లేని వార్తలతో బురద జల్లుతున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ అధికారి కూడా లీకు వార్తల కుట్రలో భాగస్వామిగా ఉన్నారు.   

ఉత్తీర్ణత 10.15 శాతమే..
ఎంత మంది పరీక్షలు రాశారు? ఉత్తీర్ణులు ఎంతమంది? ఏ పోస్టులు ఎన్ని? అందుకు తగినట్లు ఉత్తీర్ణత శాతం ఉందా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తే వాస్తవం తేలిపోతుంది. 1,26,728 పోస్టులకు గాను 19,50,582 మంది పరీక్షలు రాస్తే కేవలం 1,98,164 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 10.15 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. 

ఆ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారో?
సాధారణంగా ఏ పరీక్ష నిర్వహించినా 50 శాతానికిపైగానే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే సచివాలయ ఉద్యోగాల ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ చాలా పటిష్టంగా చేపట్టడంతో పరీక్ష రాసిన వారిలో కేవలం 10.15 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఎల్లో మీడియా, ప్రతిపక్ష నేత గగ్గోలు పెడుతున్నట్లు పశ్నప్రతం లీక్‌ అయితే సగం మందికిపైగా పరీక్షలు రాసిన వారు ఉత్తీర్ణులయ్యే వారనే ఆలోచన కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రశ్నపత్రాలతో సంబంధం లేని యూనివర్సిటీలకు వాటి రూపకల్పన బాధ్యతలు అప్పగించినట్లు కూడా ఎల్లో మీడియా అసత్యాలను వండి వారుస్తోంది.

దీనికి ఏమంటారో..?
- ఉద్యాన అసిస్టెంట్‌ పోస్టులు 4,000 ఉండగా 10,786 మంది పరీక్ష రాశారు. వీరిలో కేవలం 2,622 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. నిజంగానే ఈ ప్రశ్నాపత్రం లీక్‌ అయితే మొత్తం పరీక్ష రాసిన వారు లేదా అందులో సగం మందైనా ఉత్తీర్ణత సాధించాలి కదా?  
- డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 11,158 ఉంటే ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన వారిలో కేవలం 1.33 శాతమే ఉత్తీర్ణులైతే ప్రశ్నాపత్రం లీకైనట్లు కనీస పరిజ్ఞానం లేకుండా అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు.
- వార్డు శానిటేషన్‌ పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాశారు. కేవలం 1,474 మంది అంటే 2.8 శాతమే ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని వార్తలు