అంతా ఆయన వల్లే!

14 May, 2019 05:02 IST|Sakshi

పోలవరానికి కేంద్రం నిధులు రాకపోవడానికి కారణం చంద్రబాబే

వ్యయానికి ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టీకరణ

పది నెలలైనా ఆడిట్‌ రిపోర్ట్‌ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

భూసేకరణ కుంభకోణం బయటపడుతుందని బాబు ఆందోళన

అందుకే ఆడిట్‌ స్టేట్‌మెంట్‌కు మోకాలడ్డిన వైనం

ఇచ్చుంటే పోలవరానికి నిధుల వరద పారేదంటోన్న అధికారవర్గాలు

పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తన వంది మాగధుల అక్రమాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారు. మార్చి 31, 2014 దాకా ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖకు ఇవ్వకుండా మోకాలడ్డారు. ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఉంటే ప్రాజెక్టుకు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదలచేసి ఉండేదని’’ చెబుతున్నాయి జలవనరుల శాఖ అధికారవర్గాలు.

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం వెంటవెంటనే నిధులివ్వక పోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్బుద్ధే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికార వర్గాల మనోగతాలు దీన్నే ధ్రువపరుస్తున్నాయి. పోలవరం భూసేకరణలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి రూ.500 కోట్లకు పైగా కాజేసిన తన వంది మాగధులను రక్షించడానికే కేంద్రానికి ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడ్డారని జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ధ్రువీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు పైరవీల మేరకే సెప్టెంబరు 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 1, 2014 తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని స్పష్టం చేసింది. 2013–14 ధరల ప్రకారమే నిధులు విడుదల చేస్తామని కూడా మెలిక పెట్టింది. ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టుకు రూ.11,358.26 కోట్లను ఖర్చు చేస్తే రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. మిగిలిన నిధులు ఇవ్వాలంటే.. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించక ముందు అంటే మార్చి 31, 2014 వరకూ ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తే, దాని ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి నిధులు మంజూరు చేస్తామని జూలై 26, 2018న కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దానికి చంద్రబాబు మాత్రం స్పందించలేదు.

ప్రాజెక్టును ఫణంగా పెట్టి వందమాగధులను రక్షించి...
మార్చి 31, 2014 వరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో భూసేకరణ, పునరావాసానికి రూ.1,298.31 కోట్లు, హెడ్‌ వర్క్స్‌.. కుడి, ఎడమ కాలువల పనులకు రూ.3,837.56 కోట్లను వ్యయం చేసింది. ఈ వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ను పోలవరం ప్రాజెక్టు అధికారులు పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సమర్పించారు. భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయానికి సంబంధించి ఆడిట్‌ సేŠట్‌ట్‌మెంట్‌ను కూడా ఇస్తే.. ఈ రెండు రిపోర్టులను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామని పీపీఏ స్పష్టం చేసింది. దాంతో భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ తయారీకి ప్రత్యేక కలెక్టర్‌ నేతృత్వంలో భూసేకరణ అధికారులు సిద్ధమయ్యారు. ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ తయారు చేస్తే, మార్చి 31, 2014కు ముందు సేకరించిన భూమినే ఏప్రిల్‌ 1, 2014 తర్వాత సేకరించినట్లు చూపి తన వందిమాగధులు రూ.500 కోట్లకు పైగా దోచేసిన వ్యవహారం బయటపడుతుందని సీఎం చంద్రబాబు గ్రహించారు. గతంలో సేకరించిన భూముల లెక్కలు తీస్తూపోతే.. తాజాగా చేయాల్సిన భూసేకరణ ఆలస్యం అవుతుందనే సాకు చూపి ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ తయారీకి మోకాలడ్డారు. పైగా కేంద్రం నిధులు ఇవ్వడంలేదని నెపం అటువైపు నెట్టారు. 

ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తే రూ. 4,631 కోట్లు వచ్చేవి...
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ డీపీఆర్‌పై కేంద్ర జలవనరుల శాఖ, ఆర్థిక శాఖలు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. పోలవరానికి నిధులు విడుదల చేయాలంటే ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను కేంద్రానికి ఇవ్వాల్సిందే. అయితే చంద్రబాబు మాత్రం వందిమాగధులను రక్షించుకోవడం కోసం ప్రాజెక్టునే ఫణంగా పెడుతున్నారు. పది నెలలుగా ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను కేంద్రానికి ఇవ్వకపోవడంతో నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది. ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను ఇచ్చి ఉంటే ఇప్పటివరకూ చేసిన వ్యయంలో రీయింబర్స్‌ చేయగా మిగలిన రూ.4,631 కోట్లను కేంద్రం ఇచ్చి ఉండేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

>
మరిన్ని వార్తలు