అసలే అక్రమం.. ఆపై అసత్యాలు

2 Jul, 2019 04:45 IST|Sakshi

చట్ట విరుద్ధంగా నాలుగేళ్లుగా లింగమనేని ఎస్టేట్స్‌లోనే చంద్రబాబు కాపురం 

అక్కడ గరిష్ట వరద మట్టం స్థాయి 22.60 మీటర్లు, కానీ నిర్మాణాలన్నీ 19.3 మీటర్ల లోపే 

నీటి ప్రవాహానికి ఆటంకం, నదీ పరిరక్షణ చట్టానికీ వ్యతిరేకం

నేను ఉంటున్న బిల్డింగ్‌ ప్రభుత్వానికి చెందినది. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నేను ఉంటున్నా కాబట్టి అది ప్రభుత్వానిదే. దాన్ని భూ సమీకరణ కింద తీసుకుంటాం. లేకపోతే సేకరణ ద్వారానైనా తీసుకుంటాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అది ప్రభుత్వానిదే. ఇందులో క్విడ్‌ప్రో కో ఎక్కడుంది?.  
– 2016 మార్చి 6న మీడియా సమావేశంలో చంద్రబాబు

2019 ఎన్నికల తర్వాత సీఎం కార్యాలయాన్ని వదిలేశాక ప్రస్తుతం ఉంటున్న ప్రైవేట్‌ ఇంటిలోనే భవన యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఉండాలని నిర్ణయించుకున్నా.
– 2019 జూన్‌ 5న సీఎం వైఎస్‌ జగన్‌కు విపక్ష నేత చంద్రబాబు లేఖ 

సాక్షి, అమరావతి: అది పూర్తిగా అక్రమ కట్టడం.. నదీ జలాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు విరుద్ధంగా నిర్మించింది.. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలు, లోకాయుక్త ఆదేశాలను ధిక్కరించి కట్టింది. కనీసం బిల్డింగ్‌ ప్లాన్‌కు అనుమతి కూడా తీసుకోలేదు. రాష్ట్రంలోని సీనియర్‌ ఇంజనీర్లు ఆ భవనం నివాస యోగ్యం కాదంటూ స్వయంగా లేఖలు రాశారు. ఇన్ని చట్టాలు, నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి కృష్ణానది కరకట్ట లోపల నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాలుగేళ్లుగా నివాసం ఉండడంపై అందరిలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు వల్లించి ఇప్పుడు తప్పుదోవ పట్టించే యత్నాలు చేయడంపై విస్తుపోతున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు లింగమనేని ఎస్టేట్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, రాజధాని భూసమీకరణ కింద తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయాక అది ప్రైవేట్‌ భవనమంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాయడం గమనార్హం. ఉండవల్లిలో చంద్రబాబు నివసిస్తున్న అక్రమ కట్టడానికి సీఆర్‌డీఏ తాజాగా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు వల్లించి...
కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన ఇంట్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమంగా నివసిస్తుండడంతో 2016లో తీవ్ర దుమారం చెలరేగింది. క్విడ్‌ప్రోకోలో భాగంగానే ఈ ఇంటిని ఇచ్చారని, ప్రతిఫలంగా రమేష్‌కు రూ.వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై 2016 మార్చి మొదటి వారంలో ‘సాక్షి’ దినపత్రికలో ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చంద్రబాబు దీనిపై సమాధానం ఇస్తూ తాను ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదని, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుందని ప్రకటించారు. అంతకుముందు రాజధానిలో అక్రమాలపై వివరణ ఇచ్చేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. భూసమీకరణ కింద  సీఆర్‌డీఏ తీసుకున్నట్లు వెల్లడించారు. లింగమనేని రమేష్‌ సైతం అప్పట్లో మీడియా సమావేశం నిర్వహించి ఆ ఇంటితో తనకు ఏ సంంబంధం లేదని, దాన్ని ప్రభుత్వానికి భూ సమీకరణ కింద ఇచ్చేశామని తెలిపారు. సాక్షాత్తూ సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయడం, భవన యజమాని ధ్రువీకరించడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనే అంతా భావించారు. 

అధికారం కోల్పోయాక ప్రైవేటుదంటూ..
అధికారం కోల్పోయాక కూడా అక్రమ భవనంలో నివాసం ఉండాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరో అక్రమ కట్టడం ప్రజావేదికను కూడా తనకే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. తానుంటున్న భవనం ప్రైవేటు వ్యక్తిదని, అందులోనే ఉంటానని, ఒప్పందం మేరకు ఆ ఆస్తిని అనుభవిస్తానని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇదే అక్రమ నివాసానికి సంబంధించి గతంలో తాను అసెంబ్లీ, మీడియా సమావేశంలో చెప్పిన అంశాలను ఆయన నాటకీయంగా కప్పి పెట్టేశారు. తాను ఉంటున్నది ప్రైవేట్‌ భవనమంటూ అధికారం కోల్పోయాక ఆయన మాట మార్చడం గమనార్హం.

నదీ జలాల పరిరక్షణ చట్టానికి తూట్లు
నదీ జలాల పరిరక్షణ చట్టం ప్రకారం గరిష్ట వరద మట్టం స్థాయి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే కృష్ణా కరకట్ట వెంట లింగమనేని ఎస్టేట్స్‌ ఉన్న ప్రాంతంలో గరిష్ట వరద మట్టం స్థాయి 22.60 మీటర్లు కాగా అక్కడ నిర్మించిన భవనాలు మాత్రం 19.3 మీటర్ల ఎత్తులోనే ఉండటం గమనార్హం. అంటే కృష్ణానదికి గరిష్టంగా వరద వస్తే ప్రవాహానికి ఈ భవనాలు అడ్డుగా మారి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయని స్పష్టమవుతోంది. కృష్ణా నదిలో సహజసిద్ధమైన ప్రవాహానికి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయని, ఇలాంటి చోట భవనాలు నిర్మించరాదని సూచిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు సీనియర్‌ ఇంజనీర్లు లేఖలు రాశారు. ఇలాంటి భవనాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఆ లేఖల్లో స్పష్టంగా పేర్కొన్నా చంద్రబాబు లెక్క చేయలేదు. 

తొలగించాలన్న లోకాయుక్త
జాతీయ హరిత ట్రిబ్యునల్‌ 2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నది నుంచి వంద మీటర్ల లోపు ఎటువంటి కట్టడాలు నిర్మించ కూడదు. నదీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి భవనాలన్నింటినీ తొలగించాలని లోకాయుక్త 2015లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టులు చెప్పినా చట్టాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు అక్రమ కట్టడాన్ని వదల్లేదు. పైగా చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలాడడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు