-

ఈ ఏడాది ‘పోలవరం’ నీళ్లు ఇవ్వలేం

7 May, 2019 04:32 IST|Sakshi
ప్రాజెక్ట్‌ వద్ద పనులను పరిశీలిస్తున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ 

కొవ్వూరు/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది గ్రావిటీ ద్వారా నీళ్లు అందించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాల్లో పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2020 మే, జూన్‌లోపు అన్ని పనులు పూర్తిచేసి, వచ్చే సీజన్‌కి నీరిస్తామని చెప్పారు. భూసేకరణ, పునరావాసం కల్పన కోసం ఇంకా రూ.2,992 కోట్ల నిధులు అవసరమని అన్నారు. ఈ సీజన్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో పోలవరంలో రూ.11,358 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని తెలిపారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6,728 కోట్లు అందించిందని వెల్లడించారు. ఇంకా కేంద్రం నుంచి రూ,4,630 కోట్ల మేర బిల్లులు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల కారణంగా ప్రాజెక్టు పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. 

10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పూర్తి 
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 45.72 మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉందని, ఇప్పటివరకు 25.72 మీటర్ల ఎత్తుదాకా పనులు పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మరో ఇరవై మీటర్ల మేర పనులు చేయాల్సి ఉందన్నారు. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 70.17 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు 74 శాతం, మట్టి పనులు 85.5 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. స్పిల్‌వేకి 48 గేట్లుకుగాను 16 గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 30 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారని వెల్లడించారు. 50 లక్షల క్యూసెక్కుల వరదను సైతం సమర్థవంతంగా తట్టుకునేలా గేట్లను డిజైన్‌ చేసినట్లు తెలిపారు. 11.69 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పూర్తయిందన్నారు. 

23 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం 
పోలవరంలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం ద్వారా ఈ ఏడాది 23 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ నీటిని కొంతమేర వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ వి.శ్రీధర్, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ దూరంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు