కంచుకోటకు బీటలు!

18 Aug, 2018 13:55 IST|Sakshi

‘అనంత’ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేయించిన సర్వే నాయకుల్లో గుబులు రేపుతోంది. అత్యంత గోప్యంగా గత జూలైలో చేయించిన ఈ సర్వే రిపోర్టు లీక్‌ కావడంతో నాయకుల్లో కలవరం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టిక్కెట్టు దక్కుతుందా? లేదా? అనే ఆలోచన మొదలైంది. 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు మినహా తక్కిన చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కంగుతినడం చంద్రబాబు వంతయింది. మొత్తంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలోనే ఈ పరిస్థితి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో గతంలో లేని కొత్త సంప్రదాయాలు, పద్ధతులను చంద్రబాబు అవలంబిస్తున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, ర్యాంకులను ప్రకటించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి, ప్రజలను మరిచిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పట్లో మొదటి ర్యాంకు ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధికి చివరి ర్యాంకు ఇచ్చారు. ఆ తర్వాత 2016లోనూ సర్వే చేయించారు. సర్వే రిపోర్టులు బహిర్గతం చేయడాన్ని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు. వాస్తవ పరిస్థితికి, ర్యాంకుల ప్రకటనకు చాలా వ్యత్యాసం ఉందని, కొంతమందికి టిక్కెట్టు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ర్యాంకులు ప్రకటిస్తున్నట్లుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ వివరణ ఇచ్చుకుని పార్టీ కార్యవర్గం, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చామని ప్రకటించింది. ఆ తర్వాత సర్వేలు చేయించినా.. ర్యాంకులు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ వచ్చారు.


‘అనంత’లో పార్టీ పరిస్థితిపై  2016లోనే ఆందోళన
టీడీపీ బలంగా ఉన్న జిల్లాలలో అనంతపురానికి మంచిస్థానం ఉందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. 2016లో సర్వే రిపోర్ట్‌ చూసి కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ‘అనంత’ ప్రజాప్రతినిధులతో పాటు సమన్వయకమిటీ సభ్యులను అమరావతికి పిలిచి సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై 13 జిల్లాల్లో సర్వే చేయించానని, రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పార్టీ బలపడిందని భావిస్తే సర్వే రిపోర్ట్‌లో 56, 61శాతం పార్టీ పరిస్థితి బాగోలేదని వచ్చి అవాక్కయ్యానని జిల్లా నేతలతో అప్పట్లో చంద్రబాబు చెప్పారు. కానీ అనంతపురం రిపోర్ట్‌ చూస్తే 90శాతం పైగా పార్టీ దిగజారిపోయిందని రిపోర్ట్‌ వచ్చిందని అప్పట్లో జిల్లా నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో నేతల మధ్య విభేదాలతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, తరచూ సర్వేలు చేయించి, పనితీరు బాగోలేని వారికి టిక్కెట్లు ఇవ్వనని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు.

తాజా సర్వేతో మరింత దిగజారిన  పార్టీ పరిస్థితి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత జూలైలో సీఎం స్వయంగా సర్వే చేయించినట్లు తెలిసింది. అయితే ఈ రిపోర్ట్‌ తాజాగా లీక్‌ అయింది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలు తెలిసిపోయాయి. 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, 2016లోని సర్వేకు, ఇప్పటికి పోలిస్తే పార్టీతో పాటు నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్‌లో ఒక స్థానం మినహా తక్కిన ఆరు చోట్ల పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం. ఈ ఆరు స్థానాల్లో ఇప్పటికే నలుగురికి టిక్కెట్లు దక్కవని పార్టీ లీకులు కూడా ఇచ్చింది. ఆ జాబితాలో గుంతకల్లు, అనంతపురం, శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తక్కిన రెండు స్థానాల్లో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి కాకుండా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీతో పాటు జిల్లాలో కూడా చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా కాలవను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీపక్‌రెడ్డి నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాయదుర్గం కూడా ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వరనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి నియామకం వారికి ప్రతికూలంగా మారింది. టీడీపీ జెండా మోసిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్‌ లాంటి నేతలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి గడ్డుగా ఉంది. ఈక్రమంలో జాబితాలో ఉరవకొండ, తాడిపత్రిలో ఏది ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు