లాభాల్లో ఉంటేనే పీఆర్సీ

21 May, 2016 01:37 IST|Sakshi
లాభాల్లో ఉంటేనే పీఆర్సీ

♦ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చంద్రబాబు షాక్
♦ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు. 4.60 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 20 వేల మంది పీఆర్సీకి నోచుకోక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి పీఆర్సీ ఇవ్వాలని నేతలు కోరగా సీఎం  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు అడ్డొస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, అక్కడి ఉద్యోగులతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు పని చేస్తే పీఆర్సీకి మించిన వేతనాలు ఇస్తానని స్పష్టం చేశారు.

 మంచి ఫలితాలు సాధిస్తేనే..
 గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం పీఆర్సీ అమలు చేస్తామని, తాను ఆశించిన ఫలితాలు రాబడితే అంతకు మించి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలనే డిమాండ్‌పై  మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కంటింజెంట్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు పదో పీఆర్సీలో కనీస వేతనం, జూలై 2015, జనవరి 2016 రెండు విడతల డీఏ విడుదల, పది నెలల పీఆర్సీ బకాయిల చెల్లింపు, అంతర జిల్లాల బదిలీలకు ఆమోదం, పండిట్‌లు, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు జేఏసీ నేతలు చెప్పారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, కో-చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు