చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రాజధాని రైతులు

25 Nov, 2019 13:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక పథకం ప్రకారం రాజధానిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ధ్వజమెచ్చారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున‍్నారని, రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో కూడా తమకు తెలియడం లేదన్నారు. 

చంద్రబాబు నాయుడు తమని అన్ని విధాలా మోసం చేశారని రాజధాని రైతులు వ్యాఖ్యానించారు. ఈ నెల 28న రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు గ్రామాలలో పర్యటిస్తానని ప్రకటించారని, ఆయన ఏ ముఖం పెట్టుని తమ వద్దకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. రాజధాని పేరుతో తమను మోసం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని ఆయనతో మొర పెట్టుకున్నామని, అప్పట్లో తమ బాధలు వినడానికి సీఎం జగన్‌ ప్రతపక్ష నేత హోదాలో రాజధాని పర్యటిస్తే చంద్రబాబు పసుపు నీళ్లు చల్లించారని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి రైతులను కూడా మోసం చేసిన చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తే తాము ఏ నీళ్లు చల్లాలో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో అన్నివిధాలా మోసం చేసిన చంద్రబాబు ముందు రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు