ఐపీఎస్‌లతో బదిలీల బంతాట

24 Oct, 2018 04:34 IST|Sakshi

     16 నెలలు తిరక్కుండానే పలువురు ఎస్పీలపై బదిలీ వేటు

     అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఎన్నికల బదిలీలు

     రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు

     రాష్ట్రవ్యాప్తంగా 14 మంది ఐపీఎస్‌ల బదిలీ 

     డీజీపీ చెప్పిన మాటలకు భిన్నంగా జరిగిన బదిలీలు

     రాజకీయ ప్రయోజనాలకోసమంటూ పోలీసు శాఖలో విమర్శలు

సాక్షి, అమరావతి: అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మాట వినని పలువురు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో జీ హుజూర్‌ అనేవారిని ప్రభుత్వ పెద్దలు ఏరికోరి నియమించుకున్నారు. మొత్తం 14 మంది ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. టీడీపీ నేతల ఒత్తిళ్లకుతోడు.. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బదిలీలు జరగడం గమనార్హం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వ పెద్దలు కావాల్సిన వారికి పోస్టింగ్‌ ఇచ్చుకున్నారు. అయితే పలు జిల్లాల్లో శాంతిభద్రతల నిర్వహణలో అధికారపార్టీ నేతల సిఫారసులను లెక్కచేయని పలువురు ఎస్పీలపై 16 నెలలు గడవకుండానే బదిలీ వేటేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. పేకాట, క్రికెట్‌ బుకీలు, శాంతిభద్రతల నిర్వహణలో తమ మాట వినలేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు, నెల్లూరు ఎస్పీ రామకృష్ణ, కడప ఎస్పీ అట్టాడ బాపూజీ వంటి వారిని బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటివరకు వేర్వేరు పోస్టుల్లో ఉన్న కొందరిని సోమవారం రాత్రి పిలిపించుకున్న సీఎం చంద్రబాబు వారితో ప్రత్యేకంగా మాట్లాడి పలు జిల్లాలకు ఎస్పీలుగా పోస్టింగ్‌లు ఇవ్వడం విశేషం. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుతో సోమవారం అర్థరాత్రి వరకు పలుమార్లు చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మొత్తానికి ఈ బదిలీల్లో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, పైరవీలకే పెద్దపీట వేశారనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని ‘ఐపీఎస్‌ బదిలీలకు రంగం సిద్ధం’ శీర్షికన ఈ నెల 20న సాక్షి ముందే చెప్పింది. కాగా, ఈ నెల 20న నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడే బదిలీలు ఉంటాయని, ఎటువంటి అపోహలకు తావుండదని చెప్పారు. కానీ మంగళవారం జరిగిన బదిలీలు అందుకు పూర్తి భిన్నంగా జరగడం విమర్శలకు తావిస్తోంది. డీజీపీ చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి, గత ఎన్నికల సమయంలో పనిచేసిన జిల్లాల్లో ఉన్నవారికి, సొంత జిల్లా వారికి బదిలీలు ఉండాలి. అందుకు పూర్తి భిన్నంగా టీడీపీ ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా చేసిన సిఫార్సులకు తలొగ్గి ఎస్పీలను బదిలీ చేయడం గమనించాల్సిన విషయం.

టీడీపీ అక్రమ దందాలకు చెక్‌ పెట్టడమే కారణం! 
గతేడాది జూన్‌లో గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చింతం వెంకటప్పలనాయుడు క్రికెట్‌ బెట్టింగ్, పేకాట క్లబ్‌లు, ఇసుక, రేషన్‌ బియ్యం, గుట్కాల అక్రమ రవాణా వంటి అక్రమ దందాలకు చెక్‌పెట్టారు. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నిర్వహించే దాచేపల్లి పేకాట క్లబ్‌ను మూయించడంతో ఎస్పీ బదిలీకి బీజం పడింది. అధికారపార్టీ నేతల అండదండలున్న కీలక క్రికెట్‌ బుకీలను అరెస్టు చేయడమేగాక బుకీల వద్ద మామూళ్లు తీసుకునే డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, సిబ్బందిపై వేటేశారు. అంతేగాక తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెట్టాలన్న అధికారపార్టీ నేతల మాటలు వినలేదు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఏకమై వెంకటప్పలనాయుడు బదిలీకి ఆరునెలలుగా పావులు కదిపి తమ పంతం నెగ్గించుకున్నారు.

అవినాష్‌రెడ్డి రాకను ఆపలేదని..
దాదాపు 14 నెలలక్రితం వైఎస్సార్‌ జిల్లాకు ఎస్పీగా వచ్చిన అట్టాడ బాపూజీ బదిలీ వెనుకా టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. జిల్లాలోని పెదదండ్లూరు గ్రామంలోని ఎస్సీల ఇంట పెళ్లికి వైఎస్సార్‌సీపీకి చెందిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాకను ఎస్పీ బాపూజీ ఆపలేదనే కోపంతో ఆయన్ను టీడీపీ   టార్గెట్‌ చేసినట్టు చర్చ సాగుతోంది. గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఉందని సాకుగా చెప్పి అవినాష్‌రెడ్డిని అడ్డుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినా ఎస్పీ వారి మాట ఖాతరు చేయకపోవడంతో బదిలీకి పావులు కదిపినట్టు చర్చ నడుస్తోంది. అనేక విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన ఎస్పీ బదిలీకి పట్టుబట్టిన మంత్రి ఆదినారాయణరెడ్డికి జిల్లా టీడీపీ నేతలు కలసిరావడంతో వారికి ఒత్తిడికి సీఎం తలొగ్గినట్టు  ప్రచారం జరుగుతోంది.

తమ మాట నెగ్గలేదని..
నెల్లూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బదిలీకి ఏడు నెలలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు పంతం నెగ్గించుకున్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తనదైనశైలిలో వ్యవహరించే రామకృష్ణ చిత్తూరు, గుంటూరు, కడప.. తరువాత నెల్లూరు ఎస్పీగా పనిచేశారు. ఎక్కడా 14 నెలలకు మించి పనిచేయని రామకృష్ణ నెల్లూరులో మాత్రం 16 నెలలు కొనసాగడం రికార్డే. ప్రధానంగా ఆయన క్రికెట్‌ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపారు. 85 క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు నమోదు చేసి439 మంది బుకీలపై కేసులు నమోదు చేయడం అధికారపార్టీకి మింగుడుపడలేదు. అనేక కేసుల్లో అధికారపార్టీ నేతల మాటను పట్టించుకోలేదు. ఆయన బదిలీకి ఇదే కారణమైందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ విధంగా పలువురు ఎస్పీలను అధికారపార్టీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం బదిలీ చేయించడంపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు