బాబు..విదేశీ డాబు!

29 Sep, 2018 04:55 IST|Sakshi

సీఎం అయ్యాక 2 నెలలకుపైగా విదేశాల్లోనే చంద్రబాబు..

డజనుకుపైగా దేశాల్లో 23 టూర్లు 

ఏ దేశానికెళ్తే అక్కడిలా అమరావతిని కడతానంటూ ప్రకటనలు

ఎక్కడా కానరాని పెట్టుబడులు

రూ.728 కోట్లతో ఏపీలో సోలార్‌ బ్యాటరీల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.డ్రోన్ల తయారీ, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రంగా మారుస్తాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రంగా చేస్తాం. ఏపీలో సముద్ర పరిశోధన, సాంకేతిక విభాగం ఏర్పాటు కోసం ‘డోయర్‌’ సంస్థ ముందుకొ చ్చింది. మెరైన్‌ టెక్నాలజీలో రూ.200 కోట్ల పెట్టుబడికి సంసిద్ధత తెలిపింది...! తాజాగా అమెరికా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇవీ! రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు రప్పిస్తామంటూ గత నాలుగున్నరేళ్లలో
ఆయన 23 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు.మరి అవి నిజంగా కార్యరూపం దాల్చాయా? 

సాక్షి, అమరావతి: కాలు కదిపితే ప్రత్యేక విమానాలు.. నాలుగున్నరేళ్లలో 13 దేశాల్లో పర్యటనలు... 23 సార్లు   విదేశీ యాత్రలు.. ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలంటూ ఆయా దేశాలకు సూచనలు.. రాష్ట్రానికి ఒరిగింది మాత్రం శూన్యం! ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల ఫలితం ఇదీ!   అధికారం చేపట్టిన తరువాత ఆయన దాదాపు 68 రోజుల పాటు విదేశాల్లోనే గడపడం గమనార్హం. రెండు మూడు నెలలకోసారి తన బృందంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. సింగపూర్, జపాన్, చైనా, లండన్, అమెరికా, దుబాయ్, స్విట్జర్లాండ్‌కు చంద్రబాబు పలుసార్లు వెళ్లారు. ఏ దేశానికి వెళితే రాష్ట్రా న్ని అక్కడి మాదిరిగా మార్చేస్తామని ప్రకటించడం రివాజుగా మారింది. ఏపీకి రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ పలు ఒప్పందాలు చేసుకున్నారు. బుల్లెట్‌ రైళ్లు,  అమరావతిలో లండన్‌ ఐ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.   

అదే సంస్థతో పదేపదే చర్చలు..
సీఎం చంద్రబాబు వరుసగా నాలుగేళ్ల నుంచి దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటూ ఎంత హడావుడి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత నెలలో దావోస్‌ సదస్సులో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు కోసం సౌదీ అరామ్‌కో సంస్థతో చర్చలు జరిపారు. 2017లో జరిగిన సదస్సులోనూ చంద్రబాబు ఇదే అంశంపై అదే సంస్థతో చర్చలు జరిపి ఓ బృందాన్ని రప్పించారు. అయితే అవేమీ ఫలప్రదం కాలేదు. 2012 లోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్థ ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. 

సింగపూర్‌ కంపెనీలకు సర్వాధికారాలు
రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే సింగపూర్‌ వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వెళ్లినా మాస్టర్‌ప్లాన్‌ తయారీ మినహా అక్కడి నుంచి వచ్చిన పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌లోని సెంటోసా టూరిజం స్పాట్‌లా విజయవాడ భవానీ ద్వీపాన్ని మార్చేస్తామని ప్రకటించినా అడుగు ముందుకు వేయలేదు. పెట్టుబడులు తేకపోగా తీవ్ర నష్టం కలిగేలా రాజధాని స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కంపెనీలకు అప్పగించారు.

షాంఘై, టోక్యోలా రాజధాని
చంద్రబాబు జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్‌ భాష ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘైలా అమరావతిని నిర్మిస్తామన్నారు. జపాన్‌ వెళ్లినప్పుడు టోక్యోలాంటి రాజధాని కడతామన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా విశాఖపట్నానికి టెంపుల్‌టన్‌ సంస్థను తెస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాజాగా చంద్రబాబు ఐరాస ఆహ్వానం మేరకు వెళ్లారని చెబుతున్నా అది ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ కార్యక్రమమేనని ఆరోపణలు వచ్చాయి.  విదేశీ పర్యటనల పేరుతో ఆయన  వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2015 జనవరి 20
దావోస్‌ 
స్పెయిన్‌ బుల్లెట్‌ రైలుపై అధ్యయనం చేస్తున్నాం. 100 రకాలైన డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించేందుకు వాల్‌మార్ట్‌ ముందుకొచ్చింది. కోనసీమ కొబ్బరినీళ్లను పెప్సికో ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తుంది. ఎయిర్‌బస్‌ రాష్ట్రంలో సి–295 విమానాల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది.

2015 ఏప్రిల్‌ 12
చైనా
షాంఘైలా అమరావతిని తయారు చేస్తాం. చైనా సివిల్‌ ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివద్ధిలో పాలు పంచుకుంటుంది. రైల్వే, రహదారులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రియల్‌ ఎస్టేట్, పారిశ్రామిక మండళ్ల అభివృద్ధితోపాటు మరికొన్ని రంగాల్లో సహకరించుకుంటాం. ఏపీ రైల్వే స్టేషన్లను బీజింగ్‌ రైల్వే స్టేషన్ల మాదిరిగా చేస్తాం. 

2015 జులై 5
జపాన్‌ 
టోక్యోలా అమరావతిని నిర్మిస్తా. విశాఖలో మిత్సుబిషి అధ్యయనం కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 

2015 సెప్టెంబర్‌ 20
సింగపూర్‌
విశ్వనగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తుళ్లూరును సింగపూర్‌లా మార్చేస్తాం. అమరావతి నిర్మాణంపై మలేషియా కంపెనీ ఇస్కాండర్‌ ఆసక్తి చూపింది.

2016 జనవరి 22
దావోస్‌
ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్‌ ఏర్పాటుకు లాక్‌హీడ్‌  ముందుకొచ్చింది. రూ.2 వేల కోట్లతో రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థ సిద్ధమైంది. విశాఖ, రాజమండ్రిలో సోలార్‌ ప్యానళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో ఇన్ఫోసిస్‌ భారీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

2018 ఫిబ్రవరి
దుబాయ్‌ 
రాష్ట్రంలో ఫోనిక్స్‌ ఆధ్వర్యంలో అతి పెద్ద రైస్‌ మిల్లు

2018 ఏప్రిల్‌ 13
సింగపూర్‌ పర్యటన

2016 మార్చి 11
లండన్‌ 
అమరావతిలో ’లండన్‌ ఐ’ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో బ్రిటన్‌కు చెందిన కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్‌ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వద్ద ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం.

2016 జూన్‌ 27
చైనా 
రాష్ట్రానికి బుల్లెట్‌ రైలు రప్పిస్తాం. టియాంజిన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రూ.53,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. కృష్ణపట్నం సమీపంలో రూ.10,183 కోట్లతో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం రానుంది. దొనకొండలో రూ.43,120 కోట్లతో 10 వేల ఎకరాల్లో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దీనిద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పిస్తాం.

2016 జులై 9
కజకిస్తాన్‌ 
ప్రధాని మోదీ సూచనల మేరకు కజకిస్తాన్‌ను సందర్శిస్తున్నా. అమరావతితో ఈ ప్రాంతానికి సారూప్యం ఉంది. ఆస్తానా నిర్మాణం మాకు ఆదర్శం. ఏపీకి గుర్తింపు తెచ్చేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నా.

2016 జులై 11
రష్యా 
ఏపీలో మెరైన్‌ వర్సిటీ ఏర్పా టుకు ఒప్పందం కుదిరింది.

2017 మే 6
అమెరికా 
విశాఖకు టెంపుల్‌టన్‌ సంస్థను తెస్తాం.

2017 అక్టోబర్‌
అమెరికా, లండన్, దుబాయ్‌
అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, అయోవా, న్యూయార్క్‌లను సందర్శించా. 70 ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటితో 8 వేల మందికి ఉద్యోగాలొస్తాయి. ఏపీలో 550 కోట్ల డాలర్ల వ్యయంతో ఏరోసిటీ ఏర్పాటుతో 20,000 ఉద్యోగాలు రానున్నాయి. ఏపీలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు అల్‌ అర్ఫాజ్‌ గ్రూప్‌ సిద్ధమైంది.

పలు విదేశీ పర్యటనల సమయంలో చంద్రబాబు ఏం చెప్పారంటే
2014 నవంబర్‌ 14
సింగపూర్‌ 
టూరిస్ట్‌ హబ్‌గా ఏపీని మార్చి జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తాం. రాష్ట్రాన్ని పారిశ్రామిక కూడలిగా మారుస్తాం.

2014 నవంబర్‌ 24
జపాన్‌ 
రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంచే అత్యాధునిక విధానాలు, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించి ఈ పర్యటనలో ఒప్పందాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో 4,000 మెగావాట్ల విద్యుత్‌ కర్మాగారం నిర్మిస్తాం. ఏపీ ప్రభుత్వం–సుమిటోమో సంస్థ ఉమ్మడి అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి కొత్త అవకాశాలను గుర్తిస్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి  ఆధునిక యంత్రాలు, సాగు పద్ధతులను తెస్తాం. సుమిటోమో సహకారాలతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం.

మరిన్ని వార్తలు