శాస్త్ర, సాంకేతిక రంగాలదే భవిష్యత్

28 Jan, 2016 04:01 IST|Sakshi

ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన చంద్రబాబు
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): శాస్త్ర, సాంకేతిక రంగాలదే భవిష్యత్ అని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రస్తుతం నాల్గవ పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ స్టాక్ ఆఫ్ విలేజెస్, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘ఏపీ సైన్స్ కాంగ్రెస్’ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఎస్వీయూ, మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా, డిజిటల్ టెక్నాలజీ నినాదంతో ముందుకెళుతున్న ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామానికి , ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.5 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు.

ఈ ఖర్చును తగ్గించేందుకు విద్యుత్ స్తంభాలద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  జూలైకి ప్రతి ఇంటికీ 20 ఎంబీపీఎస్ సామర్థ్యంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. అంతకుముందు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు మాజీ చైర్మన్ పి.రామారావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(హైదరాబాద్) చైర్మన్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణలకు ఎస్వీయూ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల్ని సీఎం చేతులమీదుగా అందజేశారు.

కళలు జీవితంలో భాగం కావాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్‌టీఆర్ స్పూర్తితో కళలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కళలు మనజీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం రాత్రి తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన నందినాటకోత్సవం-2015 బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.100 కోట్లతో కూచిపూడి నృత్యాన్ని ప్రోత్సహించి శాశ్వతంగా ప్రపంచపటంలో పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలల్లో పాఠ్యాంశంగా పెడతామని తెలిపారు. రాజమండ్రిలో‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, సీనియర్ రంగస్థల, సినీ నటులు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి 2015 ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను  దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు.  ఇలావుండగా.. ఉత్తమ పుస్తక రచనలో భాగంగా ప్రముఖ రచయిత పైడిపాల 2015కుగాను ఆత్రేయ అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

>
మరిన్ని వార్తలు