చంద్రబాబుది నిరంకుశ పాలన

19 Jan, 2015 01:58 IST|Sakshi
చంద్రబాబుది నిరంకుశ పాలన

చిలకలూరిపేటటౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పద్ధతుల్లో పాలన చేస్తున్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు విమర్శించారు. స్థానిక నన్నపనేని వెంకటరత్నం కళ్యాణమండపంలో సీపీఎం జిల్లా మహాసభలు ఆదివారం ముగిసాయి. కార్యక్రమంలో   మధు మాట్లాడుతూ గత ఆరునెలల కాలంలో రాజధాని నిర్మాణం, హుద్‌హుద్ తుపాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు అంశాలపై ప్రతిపక్షాలతో ఒక్కసారి కూడా చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.

అలాంటిది తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలతో సంప్రదించి ఏకగ్రీవం చేసుకోవటానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలపై నిరసన వ్యక్తం చేసే  అవకాశం కూడా  ఇవ్వకుండా పోలీసుల ద్వారా ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ,టీడీపీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌కన్నా మరింత  దూకుడుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు.     

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ దారుణంగా నష్టపోగా, విభజనకు మద్దతు పలికిన టీడీపీ రాజకీయంగా లబ్ధి పొందిందన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు డాక్టర్ హేమలత, నాయకులు వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి  పాశం రామారావు ప్రసంగించారు.  
 
జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు
సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు తిరిగి ఎన్నికయ్యారు.   జిల్లా మహాసభల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా సింహాద్రి శివారెడ్డి, గద్దె చలమయ్య, వై నేతాజీ, జొన్నా శివశంకర్, జేవీ రాఘవులు, వై రాధాకృష్ణమూర్తిలను ఎన్నుకున్నారు. మరో 31 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు.

మరిన్ని వార్తలు