అది అక్రమాల ‘వేదిక’!

23 Jun, 2019 05:32 IST|Sakshi
ఉండవల్లిలోని ప్రజావేదిక

దుర్వినియోగానికీ కేరాఫ్‌ అడ్రస్‌

మూడేళ్లపాటు టీడీపీ ఆఫీసుగా వాడుకున్న చంద్రబాబు

పార్టీ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే 

ప్రభుత్వ భవనంలో పార్టీ కార్యక్రమాలేంటని విమర్శలొచ్చినా లెక్కలేదు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మరీ దుర్వినియోగం

ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మాత్రం గగ్గోలు 

సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారింది. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీస్తోంది. దాన్ని అక్రమంగా నిర్మించడమే కాకుండా ప్రభుత్వ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి వినియోగించుకున్న బాబు.. దాన్ని తనకే ఇవ్వాలనడం చర్చనీయాంశంగా మారింది. 

నిర్మాణమే అక్రమం.. 
కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన భవనాన్ని తన అధికారిక నివాసంగా మార్చుకున్న చంద్రబాబు.. 2017లో దాని పక్కనే ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా సీఆర్‌డీఏతో కట్టించారు. ఎటువంటి అనుమతుల్లేకుండా, భారీగా అంచనాలు పెంచి నిర్మించిన దీనిని ప్రజలను కలుసుకోవాలనే సాకుతో నిర్మించారు. కానీ, ఏనాడూ ప్రజలను అందులోకి రానీయలేదు. నిర్మించిన నాటి నుంచి టీడీపీ ఆఫీసుగానే వినియోగించారు. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చినా చంద్రబాబు అక్కడికి వెళ్లింది రెండు, మూడుసార్లే. ప్రభుత్వ సమావేశాలతోపాటు టీడీపీ శాసనసభాపక్ష సమావేశాలు, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు, పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు, ఇతర సమీక్షలు సైతం ఆయన అక్కడే నిర్వహించే వారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన భవనాన్ని పార్టీకి వాడుకోవడం ఏమిటనే విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రజావేదిక కిటకిటలాడేది. అభ్యర్థుల ఎంపిక, నాయకులతో మంతనాలు చేయడం దగ్గర నుంచి పార్టీ బాధ్యులందరూ అక్కడే ఉండి కార్యక్రమాలు నిర్వహించారు.

లోకేశ్‌ సమావేశాలకు ఇదే వేదిక 
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇక్కడే సమావేశం నిర్వహించారు. ఆయన కుమారుడు లోకేశ్‌ సైతం మంగళగిరి కార్యకర్తలతో ప్రజావేదికలోనే సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీమంత్రి దేవినేని ఉమా అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఇలా పార్టీ సమావేశాలకు చంద్రబాబు దాన్ని వాడుకుంటూనే తనకు కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ల సమావేశాన్ని ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించి స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ నేతలు దానిపై రాద్ధాంతం మొదలుపెట్టారు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వివాదాస్పదం చేయడంతోపాటు తమ వస్తువులను బయటపడేశారంటూ టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అసలు అందులోకి పార్టీకి సంబంధించిన వస్తువులు, ఫైళ్లు ఎందుకు వచ్చాయనే దానికి నోరు మెదపని వారు.. తమ నుంచి అన్యాయంగా ప్రజావేదికను లాక్కున్నారని ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అక్కడున్న అధికారులను దూషిస్తూ ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారని నానాయాగీ చేశారు. 

కోడ్‌ ఉల్లంఘించి మరీ దుర్వినియోగం 
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు ప్రజావేదికను ఇష్టానుసారం దుర్వినియోగం చేశారు. కోడ్‌కు విరుద్ధంగా అక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిసినా, ప్రతిపక్షాలు విమర్శించినా పట్టించుకోకుండా అక్కడి నుంచే పనిచేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఆయన లెక్కేచేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి పాలైన తర్వాత మౌనంగా ఉండి మళ్లీ ప్రజావేదికను పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. తనను ఓదార్చడం కోసం నాయకులు, జనాలను అక్కడే కలుస్తున్నారు. 

మరిన్ని వార్తలు