పోలీసులూ.. మీ సంగతి చూస్తా

11 Oct, 2019 04:33 IST|Sakshi

విశాఖలో పోలీసులకు చంద్రబాబు వార్నింగ్‌

డీజీపీ వ్యవహార శైలి అప్రజాస్వామికం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘పోలీసులూ మీ సంగతి చూస్తా.. భవిష్యత్‌లో మీరు బాధ పడతారు జాగ్రత్త’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పోలీసులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. డీజీపీ వ్యవహారశైలి అప్రజాస్వామికంగా ఉందని ధ్వజమెత్తారు. పోలీసులు కావాలంటే వైఎస్సార్‌ సీపీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటనకు విశాఖపట్నం వచ్చిన చంద్రబాబు.. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా, పోలీసు యంత్రాంగంపైనా తీవ్ర విమర్శలు చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులను తాను గుర్తుపెట్టుకుంటానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన తనకు ప్రతి ఒక్కరి జాతకాలు తెలుసని, తమాషాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ ఖబడ్దార్‌
రాష్ట్రంలో నేరస్తులు పాలన చేస్తున్నారని, పిచ్చి తుగ్లక్‌ పనులు చేస్తున్నారని, దుర్మార్గమైన ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, రౌడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పులివెందుల పంచాయితీలు సాగనివ్వబోమని, టీడీపీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పోరాడితే వైఎస్‌ జగన్‌ పులివెందుల పారిపోవడం ఖాయమన్నారు. టీడీపీ సంస్థాగత ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పార్టీలో కొందరు నాయకులను మార్చాల్సిన అవసరముందన్నారు.

మరిన్ని వార్తలు