నన్ను అవినీతిపరుడు అంటావా?

6 Feb, 2019 04:46 IST|Sakshi

నీవి, నీకొడుకివి ఆస్తులు రూ.16 వేల రెట్లు ఎలా పెరిగాయి?అమిత్‌షాపై సీఎం చంద్రబాబు మండిపాటు నాలుగేళ్లకు ముందు మోదీ, షాలు ఎక్కడున్నారు?ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా?ఎన్డీయేలోకి వస్తానని నేనెప్పుడూ అడుక్కోలేదుమీరు రమ్మంటేనే వచ్చాను.. నేను నిబద్ధత కలిగిన నేతనుఅబ్దుల్‌ కలాంను
నేనే రాష్ట్రపతిని చేశా

సాక్షి, అమరావతి: ‘‘నన్ను అవినీతిపరుడు అంటారా.. నీది, నీ కొడుకు ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయి. నువ్వా నా గురించి మాట్లాడేది?’’ అంటూ సీఎం చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై మండిపడ్డారు. వ్యవసాయ రంగంపై లఘు చర్చలో భాగంగా సీఎం మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. వేల కోట్లు దాచుకున్న వాళ్లందరినీ విదేశాలకు పంపిన ఘనత మీదేనని ఆరోపించారు. న్యాయం చెయ్యమని అడిగితే సీబీఐ, ఈడీ దాడులకు పాల్పడతారా? పశ్చిమబెంగాల్‌లో ఇలాగే చేసి చేతులు కాల్చుకున్నారని వ్యాఖ్యానించారు. అహంభావంతో ఉన్నవారికి పతనం తప్పదన్నారు.

అది నా ఘనత..
నాలుగేళ్లక్రితం మోదీ, అమిత్‌షా ఎక్కడున్నారు? ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా? అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘నలభై ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, నా గురించి మాట్లాడతారా? నేను అవినీతిపరుడని మాట్లాడుతున్నారు.. మీరు రఫెల్‌ మీద ఎందుకు విచారణ జరపట్లేదు? నేను ఎన్‌డీఏలోకి వస్తానని అడుక్కోలేదు. మీరే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడదామంటే వచ్చాను. నేనేదో బతిమాలుతున్నట్టు.. మీరు వద్దంటున్నట్టు చవకబారు విమర్శలు చేస్తున్నారు. ఇది ఒకప్పటి బీజేపీ కాదు. ఇది మోదీ–షా బీజేపీ. అప్పట్లో పీసీ అలెగ్జాండర్‌ను రాష్ట్రపతిని చేద్దామని వాజ్‌పేయి నాకు ఫోన్‌ చేస్తే వ్యతిరేకించా. తర్వాత నేను అబ్దుల్‌ కలాం పేరు ప్రతిపాదిస్తే ఆయన్నే రాష్ట్రపతిని చేశారు.

అది నా ఘనత’’ అని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి విష్ణుకుమార్‌రాజు, కామినేని శ్రీనివాస్‌ రాజీనామా చేసి బయటకు వచ్చివుంటే అంతా హర్షించేవారన్నారు. ఐదేళ్లలో రూ.2.44 లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఎక్కడిచ్చారు, ఎప్పుడిచ్చారు, వీటన్నిటికీ జవాబు చెప్పాకే మోదీ, షా ఏపీకి రావాలన్నారు. ‘‘నిన్న పలాసలో అమిత్‌షాకు ఏమి జరిగిందో చూడలేదా... ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి, భవిష్యత్‌లోనూ ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి’’ అని అన్నారు.నాది రైట్‌ టర్న్‌.. మీది వంకర టింకర్‌ టర్న్‌: ప్రత్యేక హోదాపై తాను ఎప్పుడూ యూటర్న్‌ తీసుకోలేదని, రైట్‌ టర్నే తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు.

బీజేపీవాళ్లే వంకరటింకర టర్న్‌లు తీసుకున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులకు నిధుల కేటాయింపు, రాజధానికి నిధుల కేటాయింపు వంటి వాటిపై చర్చకు తానిప్పటికీ సిద్ధమన్నారు. తనపై ఆడవాళ్లందరూ(డ్వాక్రా మహిళలు) కోపంగా ఉన్నారని అమిత్‌షా అంటున్నారు... నామీద ఈగవాలినా డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరూ తోలు తీస్తారని చెప్పారు. ఈ రాష్ట్రానికి మీరే 650 అవార్డులు ఇచ్చారు కదా మీరా నన్ను విమర్శించేది అని మండిపడ్డారు. నన్ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదని, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడినని చెప్పుకొచ్చారు. 2014కు ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వ్యవసాయరంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ఫసల్‌ బీమా యోజన పెద్ద ఫార్సు అని, దీనిపై కేంద్రం డబ్బా కొట్టుకుంటోందని విమర్శించారు.

దేశంలోనే రైతులకు రుణవిముక్తి కల్పించింది ఏపీయేనని, ఇప్పటివరకూ రూ.24,500 కోట్లు రుణవిముక్తి చేశామని చెప్పారు. ఇంకా చేయాల్సి ఉందని, అది చేశాకే ఎన్నికలకు వెళతానని చెప్పారు. కరువు వచ్చినా, వర్షపాతం తగినంత లేకపోయినా కరువును జయించామని, అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేశామని పేర్కొన్నారు. త్వరలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలవల్లే వ్యవసాయ దిగుబడి అద్భుతంగా ఉందని, రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. 

మరిన్ని వార్తలు