తూచ్‌..ఈ జూన్‌ కాదు!

7 May, 2019 04:06 IST|Sakshi

పోలవరంపై బాబు గారి నాటకాలలో మరో వాయిదా అంకం

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ‘పోలవరం’ పనులను పరిశీలించిన చంద్రబాబు 

అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం 

2020 జూన్‌ నాటికి నీటిని విడుదల చేస్తామని మాట మార్చిన వైనం

బాబు పెట్టిన గడువు నాటికి ప్రాజెక్టును పాక్షికంగా కూడా పూర్తి చేయడం అసాధ్యం 

తేల్చిచెబుతున్న సాగునీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు 

వాస్తవానికి బాబు చేసింది చాలా తక్కువ.. ఇప్పటికీ పునాది స్థాయి దాటని

ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్, జలవిద్యుత్‌ కేంద్రం పనులు 

పోలవరానికి 59 నెలల్లో ఖర్చు చేసింది రూ.11,358.26 కోట్లు మాత్రమే 

2005 నుంచి 2009 వరకూ 44.84 శాతం

పనులు పూర్తి చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే

కుడి, ఎడమ కాలువల పనులు వైఎస్‌ఆర్‌ హయాంలోనే దాదాపు పూర్తి   

కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరంలో పర్యటించారంటున్న అధికారులు 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నెగ్గడానికి అడ్డగోలుగా హామీలిచ్చి, గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే విద్యలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చివరి రోజుల్లోనూ తన తీరు మార్చుకోవడం లేదు. అవే అబద్ధాలు.. అవే మోసపూరిత ప్రకటనలు. ఈ ఏడాది జూన్‌ నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ, ఈ ఏడాది పోలవరం నుంచి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని చంద్రబాబు సోమవారం తేల్చిచెప్పారు. 2020 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామంటూ మాట మార్చారు. కేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పాక్షికంగా కూడా పూర్తి చేయడం అసాధ్యమని సాగునీటి రంగ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులే కుండబద్దలు కొడుతున్నారు. అంటే అధికారాంతమున కూడా అబద్ధాల బాబు తన సహజ గుణాన్ని వదులుకోలేదని తేటతెల్లమవుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మరీ చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి, తనకు రావాల్సిన కమీషన్లు వసూలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పోలవరం పనులు పరిశీలించి, సమీక్షా సమావేశం నిర్వహించారని సాక్షాత్తూ అధికార వర్గాలే ఆరోపిస్తున్నాయి. 

కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు.. చంద్రబాబు చేతుల్లోకి  
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఖర్చుతో తామే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోలేమని భావించిన చంద్రబాబు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా చక్రం తిప్పారు. 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ మరుసటి రోజే పోలవరం హెడ్‌ వర్క్స్‌ వ్యయాన్ని చంద్రబాబు రూ.4,054 కోట్ల నుంచి రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 2009 నాటికే దాదాపుగా పూర్తయిన కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు చంద్రబాబు పెంచేశారు. ఆ తర్వాత హెడ్‌వర్క్స్‌తోపాటు కాలువ పనులన్నీ నామినేషన్‌పై అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, ప్రతి సోమవారం వర్చువల్‌ రివ్యూలు నిర్వహించి, కమీషన్లు వసూలు చేసుకుంటూ వస్తున్నారనే విమర్శలు టీడీపీ వర్గాల నుంచే వ్యక్తమయ్యాయి. జనవరిలో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు పెంచేందుకు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

ఎప్పటికప్పుడు గడువు పెంపు 
పోలవరం ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికే పూర్తిచేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని 2016 సెప్టెంబరు 9న శాసనసభ సాక్షిగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయనకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంత పాడారు. 2018 జూన్‌ నాటికి పనులు కొలిక్కి రాకపోవడంతో గడువును 2018 డిసెంబర్‌కు పెంచారు. కానీ, అప్పటికీ పనులు ఒక దశకు చేరుకోకపోవడంతో 2019 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులు పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ.. రోడ్‌ షోలోనూ ఇదే విషయాన్ని చంద్రబాబు పదేపదే వల్లె వేశారు. తాజాగా పోలవరం పనులను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు 2020 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, గ్రావిటీపై నీటిని విడుదల చేస్తామని చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. 

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి... 
గత ఐదేళ్లలో అక్షరాలా 90 సార్లు వర్చువల్‌ రివ్యూలు.. 29 సార్లు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా చంద్రబాబు పోలవరం పనులను పర్యవేక్షించారు. కానీ, ప్రాజెక్టు పనుల్లో ప్రధానమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్, జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి లేకుండా ఎలాంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించకూడదు. కానీ, చంద్రబాబు ఏప్రిల్‌ 17న పోలవరం పనులను వర్చువల్‌ రివ్యూ ద్వారా సమీక్షించారు. తమ అనుమతి తీసుకోకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సమీక్షా సమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లను వివరణ కోరింది. కానీ, సీఎం చంద్రబాబు ఈసీ నోటీసులను ఖాతరు చేయకుండా సోమవారం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండానే ఈఎస్‌ఈ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌ తదితర అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

నత్త నడకన దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు
ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి వీలుగా దిగువన మరో కాఫర్‌ డ్యామ్‌ను 1,660 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఈ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకుగానూ.. 4.47 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే చేశారు. మిగతా 22.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. ఈ సీజన్‌లో అంటే జూన్‌ నాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తయ్యే అవకాశం లేదు. జూన్‌ నుంచి డిసెంబర్‌ రెండోవారం వరకూ గోదావరిలో వరద ప్రవాహం ఉండటం వల్ల పనులు చేయలేని పరిస్థితి. వీటిని పరిశీలిస్తే.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. 

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే...  
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు పునాది దశను కూడా దాటకపోవడంతో చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని సోమవారం ప్రకటించారు. గత 59 నెలల్లో రూ.11,358.26 కోట్లు ఖర్చు చేసి అతి కొద్దిగా మాత్రమే పనులు చేశారు. ఈ మొత్తంలో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. ఇచ్చిన నిధులకు లెక్కలు చెబితే మిగతా రూ.4,631 కోట్లు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసినా, చంద్రబాబు నోరెత్తడం లేదు. 2005 నుంచి 2009 వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసి, 44.84 శాతం పనులు పూర్తి చేయడం గమనార్హం.  

2020 నాటికి పాక్షికంగా పూర్తి చేయడం అసాధ్యమే 
- పోలవరం జలాశయం పనుల్లో భాగంగా 2,454 మీటర్ల పొడవుతో, 53.32 మీటర్ల ఎత్తుతో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌)ను నిర్మించాలి. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేది ఈసీఆర్‌ఎఫ్‌లోనే. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణంలో ఇప్పటివరకూ పునాది(డయాఫ్రమ్‌ వాల్‌) పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ పనులను నాసిరకంగానే చేశారు. వర్షాకాలంలో వచ్చిన చిన్నపాటి వరదలకే పునాది గోడలు బీటలు వారి.. కొన్నిచోట్ల శిథిలమయ్యాయి. 
కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానం (కనెక్టివిటీస్‌) పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడానికి హెడ్‌ రెగ్యులేటర్‌లు.. కుడి వైపున రెండు టన్నెల్‌లు.. ఎడమ వైపు ఒక టన్నెల్‌ తవ్వాలి. కుడి వైపున అనుసంధానం పనులు 74.81 శాతం, ఎడమ వైపున అనుసంధానం పనులు 48.51 శాతమే పూర్తయ్యాయి. 
పోలవరం కుడి కాలువలో 177.9 కిలోమీటర్లకు గానూ 145 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా.. ఎడమ కాలువ పనుల్లో 210.92 కిలోమీటర్లకు గానూ 134 కిలోమీటర్ల పనులను లైనింగ్‌తో సహా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. మట్టి పనులు అధిక శాతం అప్పట్లోనే పూర్తయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కుడి కాలువలో మిగిలిన మట్టి పనులు పూర్తి చేశారు. ఇప్పటికీ 19 కిలోమీటర్ల పొడవున కాలువను లైనింగ్‌ చేయాల్సి ఉంది. మరో 49 కాంక్రీట్‌ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఎడమ కాలువలో ఇప్పటికీ 30.66 శాతం పనులు మిగిలిపోయాయి. వీటిని కూడా 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని అధికారులు వెల్లడిస్తున్నారు. 
2009 నాటికే లక్ష ఎకరాలను వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే సేకరించడం గమనార్హం. ఇంకా 55,599.35 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ముంపు గ్రామాలకు చెందిన 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు గానూ 3,922 కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకూ పునరావాసం కల్పించారు. అంటే.. ఇంకా 1,01,679 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. భూసేకరణ, పునరావాసం పనులు 2020 నాటికి పూర్తయ్యే అవకాశాలే లేవని అధికారులు పేర్కొంటున్నారు. 
పోలవరం జలాశయానికి అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాల్సిన జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. 
క్షేత్రస్థాయిలో పనుల తీరు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం యథాప్రకారం 2020 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.  
చాలా సమయం పడుతుంది.. 

‘‘పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తి కాలేదు. ఈ సీజన్‌లో కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయ్యే అవకాశం లేదు. కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించి, గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించాలంటే.. స్పిల్‌ వేకు 48 గేట్లు అమర్చాలి. స్పిల్‌ చానల్‌ నిర్మాణం పూర్తి చేయాలి. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ను నాణ్యతగా పూర్తి చేయడం నెలల్లో అయ్యేది కాదు. వీటికి సమాంతరంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేయడానికి కూడా ఏళ్లు పడుతుంది. కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాల పనులు, కాలువల్లో మిగిలిపోయిన పనులు, పునరావాసం పనులు పూర్తి చేయడం ఇప్పట్లో అయ్యేది కాదు. మూడేళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఈ లెక్కన 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం అసాధ్యమే.’’   
– సీతాపతిరావు, ప్రభుత్వ సాగునీటి శాఖ మాజీ సలహాదారు   

ఎగువ కాఫర్‌ డ్యామ్‌..  ఎప్పటికి పూర్తయ్యేనో..!
ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి వీలుగా గోదావరి నదిని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి ఎగువన 2,454 మీటర్ల పొడవున కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. దీన్నే 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి, గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 72.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకుగాను.. ఇప్పటిదాకా 21.51 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే చేశారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో మిగతా 51.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తకావడానికి ఎంతకాలం పడుతుందో అంచనాకు అందడం లేదు. 

స్పిల్‌వే పనులు పూర్తి కావడం కష్టమే
పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడానికి స్పిల్‌వే (కాంక్రీట్‌ ఆనకట్ట) నిర్మించాలి. స్పిల్‌వేను 1054.4 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. స్పిల్‌వేకు 25.72 మీటర్ల వద్ద(క్రస్ట్‌ లెవల్‌) 48 చోట్ల.. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు అంటే 45.72 మీటర్ల వరకూ(ఎఫ్‌ఆర్‌ఎల్‌) గేట్లు ఏర్పాటు చేయాలి. ఈ స్పిల్‌వే పనుల్లో 38.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగానూ.. ఇప్పటివరకూ 26.28 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. మరో 12.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేయాలి. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ ఒకచోట మాత్రమే కేవలం స్కిన్‌ ప్లేట్‌ను అమర్చారు. ఒక్కో గేటును అమర్చడానికి 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు చొప్పున 96 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను అమర్చాలి. వాటిని జర్మనీ నుంచి ఇంకా దిగుమతి చేసుకోలేదు. ఈ పనులు 2020 నాటికి పూర్తి కావడం సాధ్యం కాదని అధికార వర్గాలు అంటున్నాయి. 

పోలవరం నుంచి నీళ్ల విడుదలపై చంద్రబాబు మార్చిన గడువులు
మొదటి గడువు జూన్‌ 2018
రెండో గడువు డిసెంబర్‌ 2018
మూడో గడువు జూన్‌ 2019
తాజా గడువు జూన్‌ 2020 

మరిన్ని వార్తలు