ఇదీ..‘చంద్రన్న బీమా’ చోద్యం!

29 Jan, 2019 11:50 IST|Sakshi
ఐకేపీ ఏపీఎంకు చంద్రన్న బీమా బాండు అందజేస్తున్న బాదితురాలు

రెండేళ్లుగా ఐకేపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ

చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఈమె పరిస్థితి. అధికారుల అలసత్వం కారణంగా ఈ అమాయక మహిళ గత రెండేళ్లుగా ఐకేపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగలేదు. వివరాల్లోకి వెళితే మండలంలోని పులికల్లు పంచాయతీ వీరగంగన్నగారిపల్లికి చెందిన వై. వెంకట్రమణ, సరస్వతి దంపతుల కుమారుడు రమేష్‌ బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

దంపతులిద్దరూ పులికల్లులోని నాగేశ్వరస్వామి ఆలయంలో తల దాచుకుని జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ యజమాని వై.వెంకట్రమణ అనారో గ్యం కారణంగా 2017 అక్టోబర్‌ 4న మృతి చెందాడు. చంద్రన్న బీమా ద్వారా దహన సంస్కారాలకు రూ.5 వేల నగదు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సి వున్నా ఇంతవరకు అధికారులు నయా పైసా కూడా అందజేయలేదు. పలుమార్లు ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఈమె గోడు పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చంద్రన్న బీమా సొమ్ము మంజూరు చేసి  న్యాయం చేయాలని బాధితురాలు సోమవారం ఐకేపీ ఏపీఎం మధుశేఖర్‌ బాబుకు విన్నవించింది.

మరిన్ని వార్తలు