పెళ్లికానుక ప్రశ్నార్థకం ?

25 Sep, 2018 12:58 IST|Sakshi

నిలిచిపోయిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

ముహూర్తాలు లేవనే సాకుతో  వెబ్‌సైట్‌ మూసివేసిన అధికారులు

కార్పొరేషన్‌లో 36 దరఖాస్తులు పెండింగ్‌

అక్టోబర్‌ 10 తర్వాత వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తామంటున్న అధికారులు

అప్పటివరకు పెళ్లిళ్లు చేసుకోవద్దా అని ప్రశ్నిస్తున్న దరఖాస్తుదారులు 

ఎంతో హంగూ ఆర్భాటంతో ప్రభుత్వం ఆరంభిస్తున్న పథకాలు ఆచరణలో అర్హులకు అందడం లేదనే విమర్శలొస్తున్నాయి. రకరకాల స్కీంలు ప్రవేశపెడుతూ ప్రకటనలిస్తున్నారేగానీ  క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తామని గొప్పగా ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల నుంచి పథకం వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం ఉండటంలేదని అంటున్నారు. 

పటమట (విజయవాడ తూర్పు): ప్రచార ఆర్భాటానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరటంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పేదింటి ఆడపిల్లకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారికి అండగా ఉంటామంటూ ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకం అస్తవ్యస్తంగా తయారైంది. నిరంతరం అందుబాటులో ఉండాల్సిన సేవలు అర్ధంతరంగా నిలిపేయటంతో కొన్ని వర్గాల వధూవరులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముహూర్తాలు లేవనే కారణంతో క్రిస్టియన్లు, ముస్లిం వర్గాల ప్రజలు పథకం  కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అధికారులు కొర్రీలు వేస్తున్నారు.  దీంతో పలువురు కాబోయే వధూవరులు, పెళ్లిళ్ల కుటుంబాలు విజయవాడ నగర పాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నమోదయ్యే కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయటంతో ఆయా ప్రాంతాలకు చెందిన 36 కుటుంబాలు ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి యత్నించినా అ«ధికారులు తమ గోడు పట్టించుకోకపోవటంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. 

అక్టోబర్‌ 10 వ తేదీ తర్వాతే రిజిస్ట్రేషన్‌/వెరిఫికేషన్‌...
అక్టోబర్‌లో ముహుర్తాలు ఉండటంతో వెబ్‌సైట్‌ను నిలుపదల చేయాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ముహుర్తాలతో పనిలేని క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ మతస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల మేరకు పెళ్లికి 15 రోజుల ముందు చంద్రన్న పెళ్లికానుక పథకానికి మీ సేవలో అర్జీ పెట్టుకుంటే కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ అధికారి/కళ్యాణ మిత్రలు పెళ్లికి సంబంధించి వధూవరుల వయస్సు, ఆధార్‌ నంబర్, బ్యాంక్‌ ఎకౌంట్, పెళ్లికార్డు తదితర వివరాలతో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ సమర్పించిన తర్వాత పెళ్లిరోజు పెళ్లి కుమార్తెకు 20 శాతం, మిగిలిన సొమ్ము 80 శాతం బ్యాంక్‌ ఎకౌంట్‌లో జమయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 15 రోజుల ముందు నమోదు చేసుకోవాల్సి ఉంటే వెబ్‌సైట్‌ నిలుపుదల చేయటంతో నమోదుకు సమస్య ఉత్పన్నమయ్యింది. అక్టోబర్‌ 10వతేదీ లోగా పెళ్లి చేసుకునే 36 కుటుంబాలకు పథకం వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.

ఫిర్యాదులు పరిశీలిస్తున్నాం
చంద్రన్న పెళ్లికానుక వెబ్‌సైట్‌పై సమస్య వస్తుంది. ఇదంతా ఆన్‌లైన్‌ విధానం. మేం వెరిఫికేషన్‌ మాత్రమే చేస్తాం. మిగిలిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.ఎంవీవీ సత్యనారాయణ, యూసీడీ ప్రాజెక్ట్‌ అధికారి

మరిన్ని వార్తలు