ఎట్టకేలకు పెళ్లికానుక

21 Apr, 2018 07:50 IST|Sakshi
చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించి కల్యాణమిత్ర సభ్యులకు బాధ్యతలను అప్పగిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

పెళ్లిళ్ల సీజన్‌కి అందని పథకం

121 మంది కళ్యాణ మిత్రల ఎంపిక

కులాల వారీగా నగదు ప్రోత్సాహం

బాల్యవివాహాల నియంత్రణకు మంచి అవకాశం : కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

విజయనగరం అర్బన్‌ : నిరుపేద వర్గాలకు చెందిన మహిళల వివాహానికి భరోసా కల్పిస్తామంటూ జనవరిలో ప్రకటించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులకు సహాయం అందేలా కార్యాచరణ చేపడుతున్నట్టు అప్పట్లో ప్రకిటించింది. పెళ్లిళ్లు సీజన్‌ పూర్తయినంత వరకు దాని ప్రస్తావనే లేదు. దీంతో ఈ పథకం అమలుపై పలు అనుమానాలు రేగాయి. పథకానికి సంబంధించి జీవో నంబబర్‌ 45ని గురువారం ప్రభుత్వం జారీచేసి శుక్రవారం నుంచి లాంఛనంగా అమల్లోకి తెచ్చింది. పెళ్లిళ్ల సీజన్‌ దాదాపు చివరిదశకు చేరిన తరువాత ఇప్పుడు ప్రారంభించిన ఈ పథకం ప్రయోజనం పొందినవారు అల్పసంఖ్యలోనే ఉంటారని తెలుస్తోంది.

 ‘విజయనగరం మండలం జొన్నవలసకు చెందిన లెంక అప్పలస్వామి కుమార్తె సత్యవతికి ‘చంద్రన్న పెళ్లికానుక’ వర్తించే అర్హత ఉంది. జనవరిలో ప్రభుత్వం ప్రకటన చూసి పెళ్లి ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డారు. ఫిబ్రవరిలో పథకం అమలు అవుతుందని మార్చి నెలలో మూహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి నాటికి అమలు కాకపోవడంతో అప్పుచేసి పెళ్లి చేశారు’. అప్పలస్వామి లాగానే వెళ్లికానుక ప్రోత్సాహంపై ఆశపడి పెళ్లినిర్ణయించుకొని అప్పులు పాలయిన వారు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉండడం గమనార్హం. 

అర్హులు వీరే....
పెళ్లి చేసుకునే మహిళ వయసు 20, వరుడి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చంద్రన్న పెళ్లికానుక వర్తిస్తుంది. 

ప్రోత్సాహం ఇలా... 
కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీ, ఎస్టీలకు రూ.75 వేలు, బీసీలకు రూ.50 వేలు, దివ్యాంగులకు రూ.లక్ష చెల్లిస్తారు. చంద్రన్న పెళ్లి కానుకలో ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు, మైనారిటీ ముస్లింలకు దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు అందజేస్తారు. భవన నిర్మాణ కార్మికుల మండలిలో సభ్యులుగా చేరిన కార్మికులకు కూడా వివాహ ప్రోత్సాహనగదును అందజేస్తారు. ఎస్టీలు, మైనారిటీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
వివాహం చేసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దానిని ఆధార్‌ నంబరుతో చేయవచ్చు. దానికి అనుసంధానం చేయకపోతే 1100 పరిష్కార వేదిక, మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. దీని కోసం జిల్లాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.సీహెచ్‌పీకే.ఏపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉంటాయి. దానిలో మాత్రమే దరఖాస్తుల చేసుకోవాలి.

బాల్యవివాహాల నియంత్రణకు మంచి అవకాశం
బాల్య వివాహాల నియంత్రణకు చంద్రన్న పెళ్లికానుక అద్భుత అవకాశమని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అన్నారు. స్థానిక మహిళా ప్రాంగణలో శుక్రవారం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న పెళ్లి కానుక వధూవరుల రిజస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. నమోదయిన లబ్ధిదారులకు వారం రోజుల్లోగా వివాహ ధ్రువపత్రాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో  డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, మెప్మా పీడీ లకు‡్ష్మనాయుడు, ఏపీడీ మురళి, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, కళ్యాణ మిత్రలు పాల్గొన్నారు. 

121 మంది కల్యాణ మిత్రల ఎంపిక.... 

జిల్లాలో చంద్రన్న పెళ్లికానుకను రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ (సెర్ప్‌) పర్యవేక్షిస్తుంది. పదోతరగతి విద్యార్హత గల స్వయం సహాయక సంఘ మహిళలను కళ్యాణ మిత్రలుగా ఎంపిక చేశారు. మండలానికి ఒక రిజర్వడ్‌తో కలిసి ముగ్గురు వంతున 112 మంది, ఐదు మున్సిపాలిటీల్లోని 19 మంది కలిపి జిల్లాలో మొత్తం 121 మందిని ఎంపిక చేశారు. కళ్యాణ మిత్రలు ఎవరైనా సెలవు పెడితే రిజర్వు కళ్యాణ మిత్రలు విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు జిల్లాలోని  923 పంచాయతీలకు చెందిన 923 మంది వీఏఓలకు శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునే వారు తమ వివరాలను నమోదు చేసుకున్న తర్వాత వివరాలను సేకరించేందుకు కళ్యాణ మిత్రలు క్షేత్ర సందర్శనలు చేయాల్సి ఉంటుంది. 
 

మరిన్ని వార్తలు